రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ దాదాపు రెండు నెలలుగా రైతులు దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళణ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వీరి ఉద్యమానికి అనుకూలంగా, వ్యతిరేకంగా పలువురు సెలబ్రెటీలు తమ మనసులోని మాటను చెబుతున్నారు.

ఈ క్రమంలో కొందరి ట్వీట్లు వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మనమంతా ఓ దేశంగా సమైక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.

భారత దేశ సార్వభౌమాధికారానికి విఘాతం కలుగకూడదని హెచ్చరించారు. బాహ్య శక్తులు కేవలం ప్రేక్షకులుగానే ఉండాలని, మన దేశ వ్యవహారాల్లో భాగస్వాములు కారాదని స్పష్టం చేశారు. భారత దేశం గురించి భారతీయులకు తెలుసునని, భారత దేశం కోసం ఏ నిర్ణయమైనా భారతీయులే తీసుకోవాలని సచిన్ పేర్కొన్నారు. 

రైతుల ఉద్యమంపై పాప్ సింగర్ రిహానా చేసిన ట్వీట్‌కు కౌంటరిచ్చారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. భారతదేశ ఐకమత్యాన్ని ఇలాంటి ప్రచారాలు దెబ్బతీయలేవని.. దేశ పురోగతిని అడ్డుకోలేవని ఆయన స్పష్టం చేశారు.

భారతదేశ భవిష్యత్‌ను నిర్ణయించేది విష ప్రచారాలు కాదు.. అభివృద్ధి అన్నారు అమిత్ షా. మరోవైపు ఢిల్లీలో రైతుల ఉద్యమం అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతోంది. పాప్ సింగర్ రిహానా ట్వీట్‌తో ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

మనమెందుకు దీని గురించి మాట్లాడటం లేదంటూ.. రైతుల ఉద్యమంపై సీఎన్ఎన్ ప్రచురించిన కథనాన్ని ట్వీట్ చేశారు రిహానా. ఆమె ట్వీట్ నిన్నంతా చాలా సేపు ట్రెండ్ అయ్యింది.

అయితే ఆ విషయంలో రిహానాకు పలువురు మద్ధతు తెలిపితే.. మరికొంత మంది మాత్రం పూర్తి స్థాయి అవగాహన తర్వాతే స్పందించాలని హితవు పలికారు.

ఇకపోతే రిహానా బాటలోనే స్పందించారు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ మేనకోడలు మీనా హ్యారిస్, పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్‌బర్గ్. రిహానా ట్వీట్‌పై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ భగ్గుమన్నారు.

ఉద్యమం చేస్తుంది రైతులు కాదని, దేశాన్ని విభజించాలని అనుకుంటున్న ఉగ్రవాదులని ట్వీట్ చేశారు. దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేసి చైనా కాలనీలుగా మార్చాలని అనుకుంటున్నారు.. మీలా మా దేశాన్ని అమ్ముకోవాలని అనుకోవడం లేదని రిహానాపై కంగనా విరుచుకుపడ్డారు. 

అమిత్ షా స్టేట్‌మెంట్ ఇచ్చిన కొద్దిసేపటికే సచిన్ టెండూల్కర్ దాదాపు అదే అర్ధం వచ్చేలా ట్వీట్ చేయడం సంచలనం కలిగిస్తోంది.