షేన్ వార్న్ లేడనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నానంటూ ఎమోషనల్ అయిన సచిన్ టెండూల్కర్... చివరిగా షేన్ వార్న్‌కి పంపిన టెక్ట్స్ మెసేజ్ గురించి చెప్పిన మాస్టర్..

క్రికెట్ ప్రపంచంలో స్నేహానికి దేశం, రాష్ట్రం అనే సరిహద్దులు ఉండవు. ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్‌లా మాదిరిగానే సచిన్ టెండూల్కర్, షేన్ వార్న్ కూడా మంచి స్నేహితులు. ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్, మార్చి 4న గుండెపోటుతో ఆకస్మిక మరణం చెందిన విషయం తెలిసిందే...

52 ఏళ్ల వయసులో షేన్ వార్న్ అకాల మరణంతో యావత్ క్రికెట్ ప్రపంచంలో విషాదం అలుముకుంది. దాదాపు నెల రోజులు కావస్తున్నా, ఇప్పటికీ చాలామంది ఆ చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, తన స్నేహితుడు షేన్ వార్న్‌ని తలుచుకుని ఎమోషనల్ అయ్యాడు...

‘నేను మొదటిసారి 1991లో షేన్ వార్న్‌తో కలిసి ఆడాను. ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ప్రత్యర్థులుగా మేం బరిలో దిగాం. తెల్లగా, బలిష్టంగా ఉన్న ఓ యువకుడు లెగ్ స్పిన్ వేస్తుండడాన్ని చూశాను...
నేను అప్పటికే రెండేళ్లు అంతర్జాతీయ క్రికెట్ అనుభవం గడించాను. అందుకే అప్పుడు ప్రత్యర్థి టీమ్‌లోని బౌలర్లపైనే ఎక్కువ ఫోకస్ ఉండేది. వాళ్లు ఎలా బౌలింగ్ చేస్తున్నారనే విషయాన్ని బాగా గమనించేవాడిని...
షేన్ వార్న్ బౌలింగ్‌లో కొన్ని అద్భుతమైన బంతులను ఎదుర్కొన్నాను. అయితే అప్పుడు అతని బౌలింగ్ చూస్తే ఇన్ని వికెట్లు తీస్తాడని మాత్రం ఊహించలేదు. అతనికి బలమైన వేళ్లు ఉన్నాయి...
అంతకంటే బలమైన భుజాలను వాడి వేళ్లతో మంచి గ్రిప్ సాధించేవాడు. షేన్ వార్న్ కొన్నిసార్లు తన బౌలింగ్‌తో నన్ను బాగా ఇబ్బంది పెట్టాడు...
నిజానికి ఆస్ట్రేలియా పిచ్‌లు స్పిన్‌కి పెద్దగా సహకరించవు, మ్యాచ్ మూడు, నాలుగో రోజు వరకూ సాగితేనే స్పిన్ తిరగడం మొదలవుతుంది. అయితే షేన్ వార్న్ మొదటి బంతి నుంచి స్పిన్ రాబట్టగలడు...
ఐపీఎల్ 2021 తర్వాత నేను ఇంగ్లాండ్‌కి వెళ్లి లండన్‌లో కొన్నిరోజులు గడిపి వచ్చాయి. అక్కడ గోల్ఫ్ ఆడాలని అనుకున్నా. గోల్ఫ్ ఆడడమంటే నాకు చాలా సరదా...
షేన్ పక్కనుంటే ఎప్పుడూ డల్‌ మూమెంట్స్ ఉండవు. అతను చాలా జోక్స్ వేస్తూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు. అతను ఓ మంచి గోల్ఫర్ కూడా...

ఇప్పటికీ షేన్ వార్న్ నాతో లేడనే నిజాన్ని నేను నమ్మలేకపోతున్నా... అతను ఎప్పుడూ మన హృదయాల్లోనే ఉంటాను.. నేను చివరగా లండన్‌లో వార్న్‌ను కలిశా...
వార్న్‌కి యాక్సిడెంట్ అయ్యిందని తెలియగానే ఎలా ఉందని టెక్ట్స్ మెసేజ్ చేసి కనుక్కున్నాను. దానికి నేను నా బైక్‌ని స్పిన్ చేశా అది స్కిడ్ అయ్యింది, గాయపడ్డాను... అని రిప్లై ఇచ్చాడు...

దానికి నీకు కావాలంటే బాల్‌ని ఎలాగైనా స్పిన్ తిప్పు. కానీ బైక్‌ని తిప్పడం సరైన పని కాదు అని రిప్లై ఇచ్చాను... ’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్.. 

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కి సచిన్ టెండూల్కర్ మెంటర్‌గా వ్యవహరిస్తుంటే... రాజస్థాన్ రాయల్స్‌కి మెంటర్‌గా ఉండేవాడు షేన్ వార్న్. ఈ ఇద్దరూ రోడ్ సేఫ్టీ వరల్డ్ టూర్ సిరీస్ 2021 టోర్నీలోనూ కలిసి పాల్గొన్నారు...