Sachin Tendulkar Pays tribute to Shane Warne:  షేన్ వార్న్ ఆకస్మిక మరణంపై టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు. ఒకప్పుడు సచిన్ బ్యాటింగ్ చూసి రాత్రి వేళల్లో కలల్లో కూడా అతడే కనిపిస్తున్నాడని చెప్పాడు వార్న్.. 

తన ఆప్తమిత్రుడు, క్రికెట్ ఫీల్డ్ లో ప్రియ శత్రువు షేన్ వార్న్ మరణంపై భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కన్నీటి నివాళి అర్పించాడు. చాలా చిన్న వయసులో వెళ్లిపోయావ్ మిత్రమా.. అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. వార్న్, అతడి బౌలింగ్ ను భారత్ ఎంతమాత్రమూ మరువబోదని కొనియాడాడు. శుక్రవారం థాయ్లాండ్ లో తన విల్లాలో అచేతనావస్థలో పడి ఉన్న వార్న్.. గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సచిన్ అతడికి ట్విట్టర్ వేదికగా కన్నీటి నివాళి అర్పించాడు. 

ట్విట్టర్ లో సచిన్ స్పందిస్తూ... ‘దిగ్బ్రాంతికరమైన వార్త.. వార్నీ నిన్ను చాలా మిస్ అవుతాను. మైదానంలో, మైదానం వెలుపల నీతో ఎప్పుడూ నీరసంగా అనిపంచలేదు. మన ఆన్ ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్ చర్యలు ఎల్లప్పుడూ విలువైనదిగా పరిగణిస్తాను.. భారత్ లో నీకు ప్రత్యేకమైన స్థానం ఉంది. చాలా చిన్న వయసులో వెళ్లిపోయావ్ మిత్రమా..’అని ట్వీట్ చేశాడు.

Scroll to load tweet…

ఇక సచిన్ టెండూల్కర్-షేన్ వార్న్.. ఈ జోడీ మధ్య వైరం క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది. ఈ ఇద్దరు లెజెండ్స్ ఎదురుపడినప్పుడల్లా.. గ్రౌండ్ లో ఓ చిన్నపాటి కురుక్షేత్రమే. క్రికెట్ చరిత్రలో లెజెండ్స్ గా గుర్తింపుపొందిన సచిన్-వార్న్ లు 29 సార్లు తలపడ్డారు. ఇందులో సచిన్ ను వార్న్ ఔట్ చేసింది నాలుగు సార్లు మాత్రమే.. 

YouTube video player

టెస్టు సిరీస్ ల సందర్బంగా.. చెన్నై (1998), కాన్పూర్ (1999), అడిలైడ్ (1999), మెల్బోర్న్ (1999) లలో జరిగిన మ్యాచులలో మాత్రమే సచిన్ వార్న్ కు ఔటయ్యాడు. మిగిలిన సందర్బాల్లో మాస్టర్ బ్లాస్టర్ దే పైచేయి. ఒకానొక సందర్బంలో సచిన్ బ్యాటింగ్ ను చూసిన వార్న్.. సచిన్ తనకు రాత్రి కలల్లోకి వస్తున్నాడంటూ వ్యాఖ్యానించాడంటే భారత క్రికెట్ దేవుడు అతడిపై ఎంత ఆధిపత్యం ప్రదర్శించాడో అర్థం చేసుకోవచ్చు. వార్న్-సచిన్ మధ్య ఆన్ ఫీల్డ్ వైరాన్ని భారత అభిమానులు ఎప్పటికీ మరిచిపోరు. 

1969 సెప్టెంబర్ 13న ఆస్ట్రేలియాలోని విక్టోరియా గ్రామంలో జన్మించిన వార్న్.. అండర్-19 విభాగంలో రాణించి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. 1992లో సిడ్నీ వేదికగా టీమిండియాతో జరిగిన టెస్టుతో అరంగేట్రం చేశాడు. పదిహేనేళ్ల పాటు క్రికెట్ ప్రపంచాన్ని తన స్పిన్ తో శాసించిన ఈ స్పిన్ మాంత్రికుడు.. 145 టెస్టులలో 708 వికెట్లు తీశాడు. వన్డేలలో 194 మ్యాచులలో 293 వికెట్లు పడగొట్టాడు. రెండు ఫార్మాట్లలో కలిపి వెయ్యి వికెట్లు తీసిన బౌలర్లలో.. లంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ తర్వాత స్థానంలో వార్న్ ఉన్నాడు.