బేబీ ఏబీడీ సంచలనం.. సౌతాఫ్రికా టీ20 టోర్నీలో కేప్‌టౌన్ శుభారంభం

SA 20: మినీ ఐపీఎల్‌గా వ్యవహరిస్తున్న  దక్షిణాఫ్రికా టీ20 లీగ్ (ఎస్ఎ 20)లో   ముంబై జట్టు కొనుగోలు చేసిన ఎంఐ కేప్‌టౌన్  జట్టు శుభారంభం చేసింది.  

SA 20: MI Cape town Beat Paarl Royals By 8 Wickets in Opening Match

ఎస్ఎ 20లో  ఎంఐ కేప్‌టౌన్ అదరగొట్టింది. తొలి మ్యాచ్ లో రాజస్తాన్  రాయల్స్ కు అనుబంధ ఫ్రాంచైజీ అయిన  పార్ల్ రాయల్స్  పై ఘన విజయాన్ని అందుకుంది.  తొలుత బ్యాటింగ్ చేసిన పార్ల్ రాయల్స్..  నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులు చేయగా లక్ష్యాన్ని కేప్‌టౌన్.. 15.3 ఓవర్లలోనే ఛేదించింది.   జూనియర్ ఏబీ డివిలియర్స్ గా గుర్తింపు పొందిన  డెవాల్డ్ బ్రెవిస్.. పార్ల్ బౌలర్లపై వీర విహారం చేశాడు.  41 బంతుల్లోనే  4 ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.  

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన  పార్ల్ రాయల్స్.. ఇన్నింగ్స్ 3వ ఓవర్లోనే తొలి  వికెట్ కోల్పోయింది.  ఆ జట్టు ఓపెనర్  విహాన్ లుబ్బె (3) ను జోఫ్రా ఆర్చర్ ఔట్ చేశాడు.   కానీ జోస్ బట్లర్ నిలకడగా ఆడాడు. 42 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 51 పరుగులు చేశాడు.  ఈ లీగ్ లో తొలి ఫోర్, తొలి సిక్సర్, తొలి హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా బట్లర్ నిలిచాడు. 

అయితే వన్ డౌన్ లో వచ్చిన జేసన్ రాయ్ (13),  డేన్ విలాస్ (6) విఫలమయ్యారు.  కెప్టెన్ డేవిడ్ మిల్లర్.. 31 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 42 పరుగులు చేశాడు.  చివర్లో మోర్గాన్ (19)  బ్యాట్ ఝుళిపించాడు. ఫలితంగా  20 ఓవర్లలో  పార్ల్ రాయల్స్.. 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు మాత్రమే చేయగలిగింది.  కేప్‌టౌన్ బౌలర్లలో  జోఫ్రా ఆర్చర్.. మూడు వికెట్లు తీశాడు. 

 

అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన కేప్‌టౌన్ ఓపెనర్లు డెవాల్డ్ బ్రెవిస్, ర్యాన్ రికల్టన్ (33 బంతుల్లో 42, 5 ఫోర్లు, 1 సిక్స్)   రెచ్చిపోయి ఆడారు. ఇద్దరు కలిసి తొలి వికెట్ కు 10.4 ఓవర్లలోనే 90 పరుగులు జోడించారు.  ర్యాన్ ఔట్ అయినా  సామ్ కరన్ (20) అండగా బ్రెవిస్ పని  పూర్తి చేశాడు.  

ఈ లీగ్ లో తర్వాత మ్యాచ్ బుధవారం  డర్బన్ సూపర్ జెయింట్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్ మధ్య   జరగనుంది.  


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios