Asianet News TeluguAsianet News Telugu

SA 20 Auction: ‘మినీ ఐపీఎల్’ వేలం ప్రారంభం.. వేలంలో అమ్ముడుపోయిన తొలి ఆటగాడు అతడే..

SA 20 Auction Live: దక్షిణాఫ్రికా క్రికెట్ ప్రేమికులకు అసలైన ఫ్రాంచైజీ క్రికెట్ మజాను పంచడానికి రూపొందించిన ఎస్ఎ 20 లీగ్ వేలం ప్రక్రియ  ప్రారంభమైంది. 

SA 20 Auction Started, check Out The Interesting Details About League
Author
First Published Sep 19, 2022, 6:20 PM IST

ఆఫ్రికన్ గడ్డపై ఐపీఎల్ మజాను పంచడానికి రంగం సిద్ధమైంది. ‘మినీ ఐపీఎల్’గా పిలువబడుతున్న  సౌతాఫ్రికా టీ20 (SA 20) లీగ్ లో  కీలక ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం కేప్ టౌన్ వేదికగా వేలం ప్రక్రియ మొదలైంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఆరు ఫ్రాంచైజీలతో మొదలుకానున్న ఈ మెగా లీగ్.. బీసీసీఐ, ఐపీఎల్ పెద్దల కనుసన్నల్లో జరుగుతున్నదనేది బహిరంగ రహస్యమే. ఈ లీగ్ లోని ఆరు ఫ్రాంచైజీలలో పెట్టుబడులు పెట్టింది కూడా ఐపీఎల్ బడా బాబులే.  కాగా కేప్ టౌన్ లో జరుగుతున్న SA 20 వేలానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇక్కడ చూద్దాం. 

భారత్ లో ఐపీఎల్ వేలం మాదిరిగానే  SA 20లో కూడా  అదే విధంగా నిర్వహిస్తున్నారు. సుమారు పదేండ్ల పాటు ఐపీఎల్ వేలంలో పాల్గొని ‘హ్యామర్ మ్యాన్’ గా గుర్తింపు పొందిన రిచర్డ్ మ్యాడ్లీ (ఇంగ్లాండ్) నే అక్కడ వేలం ప్రక్రియను నడిపిస్తున్నాడు.  

వేలంలో మొత్తం 533 మంది ఆటగాళ్లు పాల్గొంటుండగా.. అందులో 248 మంది సౌతాఫ్రికాకు చెందిన క్రికెటర్లు కాగా మిగతావాళ్లు విదేశీ క్రికెటర్లు. ప్రపంచవ్యాప్తంగా టీ20 సూపర్ స్టార్లు చాలా మంది ఈ ప్రతిష్టాత్మక లీగ్ కు తమ పేరునిచ్చారు.   ముఖ్యంగా ఇంగ్లాండ్ కు చెందిన చాలా మంది ఆటగాళ్లు ఈ లీగ్ లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఐపీఎల్ వేలంలో పాల్గొన్న పలువురు  ఇక్కడ కూడా పాల్గొంటుండటం గమనార్హం.

 

కేప్ టౌన్ లో ప్రారంభమైన వేలంలో మొట్టమొదటగా వేలానికి వచ్చిన ఆటగాడు దక్షిణాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి. వేలంలో అతడిని దక్కించుకోవడానికి జోహన్నస్బర్గ్ సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్, పార్ల్ రాయల్స్ పోటీ పడ్డాయి. చివరికి పార్ల్ రాయల్స్ (రాజస్తాన్) 3.4 మిలియన్లకు  ఎంగిడిని దక్కించుకుంది.  

ఇప్పటికే ఆరు ఫ్రాంచైజీలు దక్కించుకున్న ఆటగాళ్లు : 

వేలానికి ముందే ఆరు ఫ్రాంచైజీలు పలువురు ఆటగాళ్లతో ఒప్పందాలు చేసుకున్నాయి. 

- ఎంఐ కేప్‌టౌన్ (ముంబై) : కగిసొ రబాడా, డెవాల్డ్ బ్రెవిస్, రషీద్ ఖాన్, లియామ్ లివింగ్ స్టోన్, సామ్ కరన్ 
- పార్ల్ రాయల్స్  (రాజస్తాన్) : డేవిడ్ మిల్లర్ (కెప్టెన్), జోస్ బట్లర్, కొర్బిన్ బోష్, ఒబెడ్ మెక్ కాయ్
- డర్బన్ సూపర్ జెయింట్స్ (లక్నో) : క్వింటన్ డికాక్, ప్రెనెలన్ సబ్రయెన్, జేసన్ హోల్డర్, కైల్ మేయర్స్, రీస్ టాప్లీ 
- జోహన్నస్బర్గ్ సూపర్ కింగ్స్ (చెన్నై) : ఫాఫ్ డుప్లెసిస్, గెర్లాడ్ కోయిట్జ్, మోయిన్ అలీ, మహేశ్ తీక్షణ, రొమారియా షెపర్డ్ 
-సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ (హైదరాబాద్) : మార్క్రమ్, బార్ట్మన్ 
- ప్రిటోరియా క్యాపిటల్స్ (ఢిల్లీ) : అన్రిచ్ నోర్త్జ్, మిగెల్ ప్రిటోరియస్ 

వేలం నిబంధనల ప్రకారం ఒక్కో జట్టు 17 మందిని ఎంపిక చేసుకోవచ్చు. వారిలో పదిమంది స్థానిక ఆటగాళ్లు, ఏడుగురు విదేశీ ఆటగాళ్లు ఉండొచ్చు. 

 

ఎంగిడితో పాటు ఇప్పటివరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లు : షంషీ (4.3 మిలియన్లకు ప్రిటోరియా క్యాపిటల్స్), డ్వేన్ ప్రిటోరియస్ (4.1 మిలియన్స్ కు డర్బన్ సూపర్ జెయింట్స్) డసెన్ (ఎంఐ కేప్ టౌన్.. 3.9 మిలియన్లకు). దక్షిణాఫ్రికా టాప్ ఆటగాళ్ల జాబితా ముగిశాక విదేశీ ఆటగాళ్ల వేలం ప్రక్రియ ప్రారంభం కానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios