Asianet News TeluguAsianet News Telugu

సచిన్‌కి బహిరంగ క్షమాపణలు చెప్పిన ఆర్‌పీ సింగ్... అప్పుడెప్పుడో 17 ఏళ్ల క్రితం జరిగిన దానికి...

17 ఏళ్ల క్రితం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్‌ని విభిన్నంగా రనౌట్ చేసిన ఆర్‌పీ సింగ్... సౌతాఫ్రికా20 లీగ్ సందర్భంగా క్షమాపణలు కోరిన భారత మాజీ క్రికెటర్.. 

RP Singh asks sorry for 17 years old back run-out of Sachin Tendulkar in Non-strikers end CRA
Author
First Published Jan 22, 2023, 4:21 PM IST

క్రికెట్ ప్రపంచంలో 100 సెంచరీలు బాదిన ఏకైక బ్యాటర్ సచిన్ టెండూల్కర్. ఇది కాకుండా 90ల్లో 27 సార్లు (వన్డేల్లో 17 సార్లు, టెస్టుల్లో 10 సార్లు) అవుట్ అయ్యాడు సచిన్. వీటిని కూడా సెంచరీలుగా మలిచి ఉంటే సచిన్ ఖాతాలో దాదాపు 130 సెంచరీలు ఉండ ఉండేవి...

డీఆర్‌ఎస్ అమలులోకి రాని రోజుల్లో అంపైర్ల తప్పుడు నిర్ణయాల వల్ల చాలాసార్లు సెంచరీ మిస్ చేసుకున్నాడు సచిన్ టెండూల్కర్. మరికొన్నిసార్లు అనుకోని రీతుల్లో పెవిలియన్ చేరాడు. 17 ఏళ్ల క్రితం సచిన్ టెండూల్కర్‌ అవుట్‌ కావడానికి పరోక్షంగా కారణమయ్యాడు ఆర్‌పీ సింగ్..

టీమిండియా తరుపున 14 టెస్టులు, 58 వన్డేలు ఆడి 109 వికెట్లు తీసిన ఆర్‌సీ సింగ్, 2011 వన్డే వరల్డ్ కప్ తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ప్రస్తుతం కామెంటేటర్‌గా మారిన ఆర్‌పీ సింగ్, సౌతాఫ్రికా 20 లీగ్‌కి కామెంటరీ చెబుతున్నాడు...

టీమిండయా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రాతో కలిసి హిందీ కామెంటరీ చెబుతున్న ఆర్‌పీ సింగ్, సౌతాఫ్రికా20 లీగ్‌లో ఓ వింత రనౌట్ గురించి మాట్లాడాడు. ఫిలిప్ సాల్ట్ ఆడిన స్ట్రైయిట్ డ్రైవ్, బౌలర్ కాలికి తాకి నేరుగా వెళ్లి నాన్‌స్ట్రైయికర్ ఎండ్‌లో ఉన్న స్టంప్స్‌కా తాకింది. దీంతో అప్పటికే సింగిల్ కోసం బయటికి వచ్చిన దే బర్న్ రనౌట్ అయ్యాడు..

2006 సెప్టెంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్‌ని ఈ విధంగానే రనౌట్ చేశాడు ఆర్‌పీ సింగ్. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 39.3 ఓవర్లలో 162 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 

రాహుల్ ద్రావిడ్ డకౌట్ కాగా, వీరేంద్ర సెహ్వాగ్ వన్‌డౌన్‌లో వచ్చి 6 బంతులాడి 1 పరుగు చేసి అవుట్ అయ్యాడు. యువరాజ్ సింగ్ డకౌట్ కాగా సురేశ్ రైనా 11, మహేంద్ర సింగ్ ధోనీ 18, అజిత్ అగార్కర్ 4 పరుగులు చేసి అవుట్ అయ్యారు...

78 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. ఈ దశలో హర్భజన్ సింగ్‌తో కలిసి సచిన్ టెండూల్కర్ ఏడో వికెట్‌కి 78 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. 37 పరుగులు చేసిన హర్భజన్ సింగ్‌ని క్రిస్ గేల్ అవుట్ చేయడంతో 156 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది టీమిండియా...

ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో కుదురుకున్న సచిన్ టెండూల్కర్ 102 బంతుల్లో 7 ఫోర్లతో 65 పరుగులు చేశాడు. సచిన్‌ని అవుట్ చేయడానికి విండీస్ బౌలర్లు ఆపసోపాలు పడుతుండగా శామ్యూల్స్ బౌలింగ్‌లో ఆర్‌పీ సింగ్ ఆడిన ఓ స్ట్రైయిట్ డ్రైవ్ షాట్... నేరుగా వెళ్లి నాన్‌స్ట్రైయికర్ ఎండ్‌లో వికెట్లను తాకింది...

బంతిని ఆపే క్రమంలో శామ్యూల్స్ చేతికి బంతి తగలడం, అప్పటికే సచిన్ టెండూల్కర్ సింగిల్ కోసం బయటికి రావడంతో రనౌట్‌గా ప్రకటించడం జరిగిపోయాయి. సచిన్ అవుట్ అయ్యాక 5 పరుగులు జోడించి ఆలౌట్ అయ్యింది టీమిండియా. ఈ మ్యాచ్‌లో 163 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన వెస్టిండీస్, 146 పరుగులకి ఆలౌట్ అయ్యింది...

అజిత్ అగార్కర్, మునాఫ్ పటేల్, శ్రీశాంత్ రెండేసి వికెట్లు తీయగా హర్భజన్ సింగ్ 3 వికెట్లు తీశాడు. ఆర్‌పీ సింగ్‌కి ఓ వికెట్ దక్కింది. ‘సచిన్ పాజీకి బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నా. ఆ రోజు నేను స్ట్రైయిట్ డ్రైవ్ ఆడకుండా ఉండాల్సింది..’ అంటూ వ్యాఖ్యానించాడు ఆర్‌పీ సింగ్...

ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆకాశ్ చోప్రా... ‘మరోసారి సారీ సచిన్ పాజీ’ అంటూ కాప్షన్ జోడించాడు. దీనికి రెస్పాన్స్ ఇచ్చిన సచిన్ టెండూల్కర్... ‘ఆకాశ్ చోప్రా నీకు మరోసారి చెబుతున్నా, స్ట్రైయిట్ డ్రైవ్ నా ఫెవరెట్ షాట్ కాదు... ఆర్‌పీ సింగ్ భయ్యా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కూడా వికెట్లు తీయగలడు...’ అంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు.. 
 

Follow Us:
Download App:
  • android
  • ios