ఐపీఎల్ 2019లో అత్యంత దురదృష్టమైన జట్టు ఏదైనా ఉందంటే అది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని టక్కున చెబుతారు. అయితే తొలిసారి రాయల్ ఛాలెంజర్స్‌కు అదృష్టం కలిసొచ్చింది. ఆదివారం చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి బంతికి విజయం సాధించి... ధోనిసేనపై ప్రతీకారం తీర్చుకుంది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. తొలి నుంచి చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాయల్ ఛాలెంజర్స్ బ్యాటింగ్ చేయడం క్లిష్టంగా మారింది.

కోహ్లీ ఔటైనా డివిలియర్స్, పార్థివ్ పటేల్ ధాటిగా ఆడారు. అయితే డివిలియర్స్‌ను జడేజా ఔట్ చేశాడు. ఆ తర్వాత బ్యాట్స్‌మెన్ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. పార్థివ్ పటేల్ 53 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

అనంతరం లక్ష్యఛేదనకు దిగిన చెన్నై 32 పరుగులకే 4 వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది. వాట్సన్, రైనాను స్టెయిన్ వెనక్కి పంపగా.. డుప్లెసిస్, జాదవ్‌లను ఉమేశ్ వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చాడు.

ఆ తర్వాత ధోని, రాయుడు కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. అయితే జోరు మీదున్న రాయుడిని చాహల్ ఔట్ చేశాడు.. చివరి ఆరు ఓవర్లలో 76 పరుగులు చేయాల్సిన స్థితిలో జడేజా, బ్రావో కూడా పెవిలియన్ చేరడంతో చెన్నై ఓటమి ఖాయమని అనుకున్నారు.

ఆఖరి ఓవర్లో 26 పరుగులు చేయాల్సిన స్థితిలో మిస్టర్ కూల్ రెచ్చిపోయాడు. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. వరుసగా ఐదు బంతుల్లో 4,6,6,2,6తో 24 పరుగులు చేశాడు.

చివరి బంతికి 2 పరుగులు చేయాల్సిన స్థితిలో ఉమేశ్ ఆఫ్ స్టంప్ ఆవల వేసిన బంతిని ధోని పాయింట్ వైపు కట్ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. రన్ కోసం ప్రయత్నించగా...వికెట్ కీపర్ పార్థివ్ రెప్పపాటులో బంతిని రెప్పపాటులో వికెట్ల మీదకు వేశాడు.

దీంతో శార్ధూల్ రనౌట్ అయ్యాడు. దీంతో బెంగళూరు విజయం సాధించింది. ఆ పరుగు తీసుంటే మ్యాచ్ టై అవ్వడంతో పాటు సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చేది. చెన్నై ఆటగాళ్లలో ధోని 84 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ విజయంతో ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో ఓటమికి బెంగళూరు ప్రతీకారం తీర్చుకున్నట్లయ్యింది.