ముంబై: శ్రీలంకతో జరిగి మూడు ట్వంటీ20 మ్యాచుల సిరీస్ కు టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యే అవకాశం ఉంది. అన్ని ఫార్మాట్లలోనూ వరుసగా ఆడుతూ వచ్చిన రోహిత్ శర్మ విశ్రాంతి కోరే అవకాశం ఉందని అంటున్నారు. జనవరి ప్రారంభంలో శ్రీలంకతో సిరీస్ ప్రారంభం కానుంది. 

శ్రీలంకతో తలపడే జట్టు ఎంపిక ఈ నెల 27వ తేదీన జరిగే అవకాశం ఉంది. తొలి టీ20 మ్యాచ్ జనవరి 5వ తేదీన, రెండో మ్యాచ్ ఇండోర్ లో జనవరి 7వ తేదీన, మూడో మ్యాచ్ పూణేలో జనవరి 10వ తేదీన జరుగుతాయి. 

శ్రీలంక సిరీస్ కు దూరం కానున్న రోహిత్ శర్మ ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ లో మాత్రం ఆడే అవకాశం ఉంది. టీ20 జట్టులోని సభ్యులకు సాధారణంగా సెలెక్టర్లు విశ్రాంతి ఇవ్వరు. కానీ రోహిత్ శర్మ వరుసగా ఆడుతూ వస్తున్నాడు. దాంతో ఆతనికి రెస్ట్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. తనకు రెస్ట్ కావాలని రోహిత్ శర్మ బీసీసీఐని అడిగినట్లు తెలుస్తోంది. 

రోహిత్ శర్మ ఈ సిరీస్ లో ఆడకపోతే కేఎల్ రాహుల్ తో కలిసి శిఖర్ ధావన్ ఇన్నింగ్సును ప్రారంభించే అవకాశం ఉంది. గాయం నుంచి శిఖర్ ధావన్ కోలుకు్నాడు. గాయం కారణంగానే అతను వెస్టిండీస్ తో సిరీస్ కు దూరమయ్యాడు. 

జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్ సిఏ) అంగీకరిస్తే జస్ ప్రీత్ బుమ్రా జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. గాయం కారణంగా అతను నాలుగు నెలల పాటు క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతానికి అతని పరిస్థితి అనిశ్చితంగానే ఉంది. 

కాగా, హార్డిక్ పాండ్యా కూడా గాయం కారణంగా నాలుగు నెలల పాటు క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. అతను అస్ట్రేలియాతో జరిగే సిరీస్ కు ఆడే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ జనవరి 14వ తేదీన ముంబైలో ప్రారంభమవుతుంది. పాండ్యా కూడా ఎన్ సిఏ టెస్టుకు వెళ్లాల్సి ఉంటుంది. 

ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ కు సూర్యకుమార్ యాదవ్ ను ఎంపిక చేసే అవకాశం ఉంది. కేదార్ జాదవ్ స్థానంలో అతను జట్టులోకి వస్తాడని అంటున్నారు.