Virat Kohli Childhood coach Comments On Rohit Sharma: టీమిండియా లో కూల్ కెప్టెన్ గా పేరున్న మహేంద్ర సింగ్ ధోని తర్వాత అతడి వారసుడిగా వచ్చిన కోహ్లి మాత్రం దూకుడుగా ఉండేవాడు. అయితే ఆ తర్వాత వచ్చిన రోహిత్ శర్మ కూల్ గా ఉంటూనే తోటి ఆటగాళ్లపై...
టీమిండియా నయా సారథి రోహిత్ శర్మ వ్యవహార తీరుపై విరాట్ కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఫీల్డ్ లో అతడు ఇతర ఆటగాళ్లతో ఎలా నడుచుకోవాలో నేర్చుకోవాలని సూచించాడు. ఆటగాళ్లతో పబ్లిక్ లో వ్యవహరించే తీరు ఇదైతే కాదని వాపోయాడు. కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాక రోహిత్ శర్మ.. తోటి ఆటగాళ్లతో వ్యవహరించే విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెస్టిండీస్ తో సిరీస్ సందర్భంగా యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, ఇషాన్ కిషన్ లతో అతడు వ్యవహరించిన తీరుపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ తన యూట్యూబ్ ఛానెల్ ‘ఖేల్ నీతి’లో స్పందిస్తూ... ‘రోహిత్ శర్మను అందరూ కూల్ కెప్టెన్ అని అంటారు. కానీ ఫీల్డ్ లో అతడిని చూస్తుంటే మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. తోటి ఆటగాళ్లతో ఎలా నడుచుకోవాలనేదానిపై అతడు నేర్చుకోవాలి. వారితో పబ్లిక్ లో అలా వ్యవహరించడం సరికాదు.ఒకవేళ ఎవరైనా తప్పులు చేస్తే వాటిని అర్థం చేసుకుని ఆటగాళ్లకు అర్థమయ్యే విధంగా నచ్చజెప్పాలి. అంతేగానీ వాళ్ల మీద అరవడం సరికాదు..’ అని అన్నాడు.
వెస్టిండీస్ తో వన్డే సిరీస్ సందర్బంగా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తో.. ‘ఎందుకు అలా మెల్లగా నడుస్తున్నావ్.. పరిగెత్తడానికి ఏమైంది. త్వరగా వెళ్లు..’ అని అన్న మాటలు కెమెరాలో రికార్డయ్యాయి. ఇక విండీస్ తో రెండో టీ20 సందర్భంగా భువనేశ్వర్ క్యాచ్ మిస్ చేయడంతో సహనం కోల్పోమయిన రోహిత్.. అతడు చూస్తుండగానే భువీ పక్కన ఉన్న బంతిని కాలిని బలంగా తన్నాడు. హిట్ మ్యాన్ ఇలా చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఇక చివరి టీ20 సందర్భంగా కూడా విండీస్ ఆటగాడు షెపర్డ్ కొట్టిన బంతిని అందుకున్న రోహిత్.. వికెట్ కీపర్ దిశగా బలంగా విసిరాడు. అప్పటికే వికెట్ల వద్దకు చేరుకున్నకీపర్ ఇషాన్ కిషన్.. మంచు కారణంగా కాలు జారి కింద పడ్డాడు. దాంతో అతడికి బంతి అందలేదు. బంతిని విసిరిన రోహిత్ మాత్రం అసహనానికి లోనయ్యాడు.
ఈ మూడు ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారిన నేపథ్యంలో రాజ్ కుమార్ శర్మ పై విధంగా స్పందించాడు.
