టీమిండియా వెస్టిండిస్ పర్యటనను సక్సెస్‌ఫుల్ గా ముగిచింది. టీ20, వన్డే, టెస్ట్ ఇలా అంతర్జాతీయ స్థాయిలోని అన్ని ఫార్మాట్లలోనూ కోహ్లీసేన సత్తాచాటింది. ఇలా  ఓటమన్నదే లేకుండా భారత విజయయాత్ర సాగినా కొందరు మాజీలు, అభిమానులు జట్టు కూర్పుపై సంతృప్తిని వ్యక్తం చేయడంలేదు. మరీముఖ్యంగా టెస్ట్ సీరిస్ లో సీనియర్ ప్లేయర్ రోహిత్ ను డ్రెస్సింగ్ రూంకే పరిమితం చేయడాన్ని ఎక్కువమంది తప్పుబడుతున్నారు. ఈ విషయంలో మొదటి నుండి అసంతృప్తితో వున్న మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి దీనిపై స్పందించారు. 

భారత జట్టులో సీనియర్ ఆటగాడైన రోహిత్ ను టెస్ట్ సీరిస్ ఆడించకపోవడం ముమ్మాటికీ తప్పేనని గంగూలీ అన్నాడు. టెస్ట్ ఫార్మాట్లో కూడా బెస్ట్ ప్లేయర్ అనిపించుకునే సత్తా రోహిత్ సొంతం. కానీ అతన్ని రాంగ్ ప్లేస్ లో బ్యాటింగ్ కు పంపి టీమిండియా మేనేజ్ మెంట్ తప్పు చేసింది. ఫార్మాట్ ఏదయినా ఓపెనింగ్ చేయడానికి రోహిత్ సరిగ్గా సరిపోతాడని గంగూలీ అభిప్రాయపడ్డాడు. 

వెస్టిండిస్ తో జరిగిన  టెస్ట్ సీరిస్ లో అజింక్య రహానే,  హనుమ విహారీలు మిడిల్ ఆర్డర్ లో అద్భుతంగా ఆడారని ప్రశంసించాడు. దీంతో రోహిత్ కు మిడిల్ ఆర్డర్లో చోటు దక్కడం కష్టమే. కానీ ఓపెనర్ గా అవకాశాలున్నాయి. కెఎల్ రాహుల్ ఘోరంగా విఫలమవుతున్నా ఓపెనర్ గా ఎందుకు కొనసాగిస్తున్నారో తనకు అర్థంకావడం లేదన్నాడు. మయాంక్ అగర్వాల్ ను కొనసాగిస్తూనే రాహుల్ స్థానంలో రోహిత్ ను ఆడించాలని గంగూలీ సూచించాడు. 

ప్రపంచ కప్ టోర్నీలో 648 పరుగులు, హ్యాట్రిక్ సెంచరీల ప్రదర్శనే రోహిత్ ఎంత విలువైన ఆటగాడో చెబుతోంది. అలాంటి ఆటగాడిపై టెస్టులకు పనికిరాడన్న ముద్ర వేయడం సరికాదన్నాడు. టెస్టుల్లో కూడా 50 సగటుతో పరుగులు సాధించాడు. మిడిల్ ఆర్డర్ లోనే అతడు ఈ స్ధాయిలో ఆడితే  ఓపెనర్ గా అవకాశమొస్తే మరింత  రాణిస్తాడన్న నమ్మకం వుందని  గంగూలీ వెల్లడించాడు.