మరికొన్ని గంటల్లో భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య  మొదటి టెస్ట్ ప్రారంభంకానుంది. అయితే ఈ టెస్ట్ లో రోహిత్ శర్మ ఆడటం అనుమానంగా కనిపిస్తోంది. సమీకరణాలను దృష్ట్యా అతడికి తుది జట్టులో చోటు దక్కకపోవచ్చని తెలుస్తోంది. రోహిత్ ఈ మ్యాచ్ లో బరిలోకి దిగేది లేనిది కెప్టెన్ విరాట్ కోహ్లీ నిర్ణయంపై ఆధారపడి వుంటుంది. అయితే అతడు కూడా జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగాలని భావిస్తున్నాడట. దీంతో స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ ను ఆడించడం కుదరదు కాబట్టి రోహిత్ ను పక్కనబెట్టే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది. 

ఏ విధంగా చూసినా రోహిత్ ఈ మ్యాచ్ లో బరిలోకి దిగడం అనుమానంగానే కనిపిస్తోంది. కానీ టీమిండియా మాజీలు మాత్రం మంచి ఫామ్ లో వున్న రోహిత్ ను ఆడించాలని సూచిస్తున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్లోనే కాదు టెస్ట్ ఫార్మాట్లోనూ రోహిత్ సత్తాచాటగలడని పేర్కొంటున్నారు. 

ఇంతకుముందే భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రోహిత్ కు మద్దతుగా నిలిచాడు. అతన్ని టెస్ట్ సీరిస్ కోసం తుది జట్టులోకి తీసుకోవడం ద్వారా జట్టు సమతుల్యత దెబ్బతినడం కాదు మరింత సమతుల్యం అవుతుందన్నాడు. తనదైన రోజు భారీ ఇన్నింగ్స్ ఆడగల సత్తావున్న రోహిత్ వెస్టిండిస్ పరిస్థితులకు చక్కగా సరిపోతాడని అన్నాడు. కాబట్టి టెస్ట్ సీరిస్ లో అతడి సేవలను భారత జట్టు వినియోగించుకోవాలని సెహ్వాగ్ సూచించాడు. 

తాజాగా మాజీ టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. వెస్టిండిస్ తో జరగనున్న టెస్ట్ సీరిస్ లో రోహిత్ ను ఆడించడం కాదు ఓపెనర్ గా బరిలోకి దించాలని సూచించాడు. ప్రపంచ కప్ టోర్నీలో అదరగొట్టిన రోహిత్ అదే ఫామ్ ను కొనసాగిస్తే టీమిండియా సునాయాసంగా విజయం సాధించవచ్చని తెలిపాడు. కాబట్టి రోహిత్ ను టెస్టుల్లో కూడా ఓపెనింగ్ చేసే అవకాశాన్ని కల్పించాలని గంగూలీ టీమిండియా మేనేజ్‌మెంట్ కు సూచించాడు.