Asianet News TeluguAsianet News Telugu

మాకు రైట్ హ్యాండర్‌లు జట్టు నిండా ఉన్నారు.. నువ్వు లెఫ్ట్ హ్యాండర్‌వి.. అలాగే ఆడు! పంత్‌పై హిట్‌మ్యాన్ ఆగ్రహం

Rishabh Pant: ఆదివారం పాకిస్తాన్ తో ముగిసిన మ్యాచ్ లో  టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ అనవసర షాట్ కు యత్నించి పెవిలియన్ కు చేరాడు. దీంతో అతడిపై.. 

Rohit Sharma scolds Rishabh Pant after he Got out Silly Shot In IND vs PAK Match
Author
First Published Sep 5, 2022, 10:56 AM IST

ఆడుతున్నది కీలక మ్యాచ్. చేతిలో సరిపడా వికెట్లున్నాయి.  కొంచెం కుదురుకుంటే చివర్లో భారీ స్కోరు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  అదీగాక జట్టులో  ఒక్కరైనా లెఫ్ట్ హ్యాండర్ లేడని  ఎంపికచేస్తే.. పంత్ మాత్రం రైట్ హ్యాండర్ లా మారి ఔటయ్యాడు. దీంతో టీమిండియా సారథి రోహిత్ శర్మ కు  చిర్రెత్తుకొచ్చి రిషభ్ పై  ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది. 

భారత్-పాకిస్తాన్ సూపర్-4 మ్యాచ్ లో టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు వచ్చింది.  ఓపెనర్లు రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ లు దూకుడైన ఆటతో తొలి పవర్ ప్లేలోనే భారత స్కోరు 50 పరుగులు దాటించారు. కానీ భారత్.. వెంటవెంటనే  రోహిత్, రాహుల్, సూర్య వికెట్లు కోల్పోవడంతో పంత్ క్రీజులోకి వచ్చాడు. 

జట్టులో లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ కాంబినేషన్ ఉంటే బాగుంటుందని   పంత్ ను ఎంపిక చేసింది టీమ్ మేనేజ్మెంట్. అప్పటికే క్రీజులో కుదురుకున్న  విరాట్ కోహ్లీతో కలిసి  పంత్  నిలబడితే టీమిండియా భారీ స్కోరు చేసేదేమో. కానీ 12 బంతుల్లో 14 పరుగులు చేసిన పంత్.. అనవసర షాట్ కు యత్నించి పెవిలియన్ చేరాడు. మహ్మద్ నవాజ్ వేసిన 14వ ఓవర్లో  రివర్స్ స్వీప్ కు ప్రయత్నించి అసిఫ్ అలీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.  

పంత్ పెవిలియన్ చేరిన తర్వాత కొద్దిసేపటికి  రోహిత్ శర్మ.. పంత్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు   తెలుస్తున్నది. ఇందుకు సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతున్నది.  పెవిలియన్ లో రిషభ్ తో పాటు మరో ఇద్దరు కూర్చుని ఉండగా.. రోహిత్ అతడితో ‘అసలు ఆ షాట్ ఎందుకు ఆడావ్..? ఈ సమయంలో అలాంటి షాట్ ఆడాల్సిన అవసరముందా..?’ అని  కోప్పడ్డినట్టు  వీడియో చూస్తే అర్థమవుతున్నది.   

 

రిషభ్ వైఫల్యంతో భారత్ తర్వాత తడబడింది.  దీపక్ హుడా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో మ్యాచ్ ముగిశాక  అర్ష్దీప్ తో పాటు రిషభ్ పంత్ కూడా ట్రోలర్ల ఆగ్రహానికి గురవుతున్నాడు. పంత్ కంటే  దినేశ్ కార్తీక్ నే ఆడిస్తే బాగుండేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.  

ఇక మ్యాచ్ విషయానికొస్తే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు వచ్చిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (60) టాప్ స్కోరర్. లక్ష్య ఛేదనలో పాకిస్తాన్.. 19.5 ఓవర్లలో  5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.  పాకిస్తాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ (71)  కీలక ఇన్నింగ్స్ ఆడాడు.  బౌలింగ్  లో ఓ వికెట్ తీసి బ్యాటింగ్ లో 42 పరుగులు చేసిన మహ్మద్ నవాజ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 

Follow Us:
Download App:
  • android
  • ios