ప్రెస్ కాన్ఫరెన్స్ లను తాను ఎక్కువగా ఎంజాయ్ చేస్తానని టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నారు.  'ఫ్రెండ్ షిప్ డే' సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు హిట్ మ్యాన్. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సరదా సమాధానాలు ఇచ్చాడు. 

ఈ ప్రశ్నల్లో భాగంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు రోహిత్ సరదాగా సమాధానం ఇచ్చాడు. మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ లలో అంత సరదాగా ఎలా ఉంటారు అని ఓ అభిమాని అడగగా.. దానికి రోహిత్ చెప్పిన సమాధానం అందరినీ ఆకట్టుకుంటోంది. ‘‘ నేను ప్రెస్ కాన్ఫరెన్స్ లను బాగా ఎంజాయ్ చేస్తా.. అప్పుడే కదా విలేకర్లు మాకు దొరికేది’’ అంటూ రోహిత్ ఆన్సర్ చేశాడు.

యూఏఈ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ జరగనుండటంతో రోహిత్ శర్మ త్వరలో ముంబై ఇండియన్స్‌ తో కలిసి క్రికెట్ మైదానంలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే న్యూజిలాండ్‌తో జరిగిన టీ 20  సిరీస్‌లో గాయం కారణంగా తర్వాత గ్రౌండ్ లోకి రాలేదు. ఇక ప్రస్తుతం కరోనా కారణంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌(ఐసీసీ) ఆటగాళ్ళు మరియు ప్రేక్షకుల భద్రత కోసం కొత్త నిబంధనలను తెచ్చింది.

కాగా.. మరో అభిమాని ఒకరు " క్రికెట్‌లో కరోనా కారణంగా వచ్చిన మార్పులలో మీరు ఏ మార్పును అనుభవించడానికి ఎదురు చూస్తున్నారు?" అని రోహిత్ ను అడిగారు. దానికి సమాధానమిస్తూ..."క్రికెట్ ఖచ్చితంగా ఇంతకుముందు ఉన్నదానికంటే వేరే విధంగా ఉంటుంది. కానీ ఆటగాళ్ళుగా మేము చేయాల్సిందల్లా కేవలం ప్రోటోకాల్‌లను పాటించడమే - బృందం ఏ ప్రోటోకాల్‌లను సెట్ చేసినా, దానిని పాటిస్తూ ఉండాల్సిందే" అని రోహిత్ చెప్పాడు. ఇక ఆస్ట్రేలియాలో అక్టోబర్‌లో జరగాల్సిన 2020 టీ 20 ప్రపంచ కప్ వాయిదా పడిన తరువాత, యూఏఈ లో సెప్టెంబర్-నవంబర్ విండోలో ఐపీఎల్ జరుగుతుంది అని బీసీసీఐ ప్రకటించింది.