కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ దెబ్బకు క్రికెటర్లంతా ఇండ్లకే పరిమితమయ్యారు. ఈ సందర్భంగా వారంతా సోషల్ మీడియా వేదికల ద్వారా అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ, సహా క్రికెటర్లతో కూడా ఆన్ లైన్ ద్వారా ముచ్చటిస్తూ అభిమానులకు వినోదాన్ని పంచడంతోపాటుగా వారి జీవితంలోని ఎన్నో విషయాల గురించి చర్చిస్తున్నారు. 

తాజాగా టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ ఓపెన్ నెట్స్ విత్ మయాంక్ కార్యక్రమంలో ముచ్చటించారు. ఈ విషయంలో ఈ ఇద్దరు డాషింగ్ ఓపెనర్లు తమ క్రికెటింగ్ జీవితంలోని అనేక విషయాలతోపాటుగా కొన్ని పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకున్నారు. 

ఈ సందర్భంగా రోహిత్ శర్మ తన మూడవ డబల్ సెంచరీ సాధించినప్పుడు తన భార్య రితిక కన్నీరు పెట్టుకున్న విషయం గురించి కూడా మాట్లాడాడు. మొహాలీలో హిట్ మ్యాన్ మూడవ ద్విశతకం సాధించిన రోజు అతని భార్య రితిక కన్నీరు పెట్టుకున్న విషయం మనందరికీ గుర్తుండే ఉంటుంది. 

ఆ మ్యాచ్‌లో తాను 195 పరుగుల వద్ద ఉన్నప్పుడు సింగిల్‌ తీయాల్సి వచ్చిందని, పరుగు కోసం పరిగెత్తిన తాను డైవ్‌ చేస్తూ కిందపడ్డానాని, ఇంకా డబల్ సెంచరీ కూడా సాధించకముందే ఆమె భావోద్వేగానికి లోనయిందని అన్నాడు రోహిత్ శర్మ. 

ఆ మ్యాచ్ పూర్తయిన తరువాత ఎందుకు ఏడ్చావు అని తాను తన భార్య రితికను అడిగానని, అప్పుడు పరుగు తీస్తున్న క్రమంలో డైవ్‌ చేయడంతో చేతికి దెబ్బ తగిలిందేమోనని భావోద్వేగానికి లోనయ్యానంటూ రితికా తర్వాత చెప్పిందట. 

ఆరోజు తాను చేసిన డబుల్‌ సెంచరీ ఎప్పటికీ గుర్తుండిపోతుందని, తాను డబుల్‌ సెంచరీ చేసిన రోజే తమ పెళ్లిరోజు అంటూ మయాంక్‌తో చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ. ఇంతవరకు వన్డే క్రికెట్లో మూడు డబల్ సెంచరీలు చేసాడు.  వేరెవ్వరికి సాధయంకాని ఈ అనితర సాధ్యమైన రికార్డును తనపేరిట లిఖించుకున్నాడు రోహిత్ శర్మ.