Asianet News TeluguAsianet News Telugu

మహ్మద్ షమీతో ఫ్యాన్స్ ‘జై శ్రీరాం’ వ్యాఖ్యలపై స్పందించిన రోహిత్..

INDvsAUS: భారత్ - ఆస్ట్రేలియా మధ్య  అహ్మదాబాద్ వేదికగా నిన్న ముగిసిన నాలుగో టెస్టు సందర్భంగా కొంతమంది అభిమానులు మహ్మద్ షమీతో వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. 

Rohit Sharma Responds On Viral Video Of  Jai Shree Ram Chants For Mohammed Shami During 4th Test MSV
Author
First Published Mar 14, 2023, 4:21 PM IST

అహ్మదాబాద్ టెస్టులో   టీమిండియా పేసర్ మహ్మద్ షమీతో అభిమానులు వ్యవహరించిన తీరుపై   టీమిండియా సారథి రోహిత్ శర్మ స్పందించాడు.  నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా   జరిగిన ఈ టెస్టులో భాగంగా తొలిరోజు ఆటలో షమీతో పాటు పుజారా,   సిరాజ్ వంటి ఆటగాళ్లు అక్కడ ఉండగా స్టాండ్స్ లో ఉన్న పలువురు అభిమానులు వారిని  చూసి అరిచారు. షమీని పిలుస్తూ.. ‘షమీ.. జై శ్రీరామ్, జై శ్రీరామ్’ అని గట్టిగా అరిచారు. 

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. షమీతో  వాళ్లు వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో భిన్న రకాలుగా కామెంట్స్ వినిపించాయి. తాజాగా ఇదే విషయమై రోహిత్ స్పందిస్తూ..  ఇది తనకు తెలియదని అన్నాడు. ఇప్పుడే తొలిసారి వింటున్నానని చెప్పుకొచ్చాడు. 

రోహిత్ మాట్లాడుతూ... ‘నిజంగా నాకు ఈ విషయం గురించి తెలియదు.  నేను ఈ విషయం ఇప్పుడే తొలిసారి వింటున్నా.  అసలు అక్కడ ఏం జరిగిందో కూడా నాకు తెలియదు..’అని అన్నాడు.  ఈ సిరీస్ లో షమీ.. మూడు మ్యాచ్ లు ఆడి 9 వికెట్లు పడగొట్టాడు.  స్పిన్నర్లు వికెట్ల పండుగ చేసుకున్న ఈ సిరీస్ లో ఫాస్ట్ బౌలర్లలో అత్యధిక వికెట్లు దక్కించుకున్నది షమీనే కావడం గమనార్హం.  

 

కాగా  భారత్ - ఆస్ట్రేలియా మధ్య ముగిసిన  అహ్మదాబాద్ టెస్టు  విషయానికొస్తే సిరీస్ లో తొలిసారిగా బ్యాటర్లకు పూర్తిస్థాయిలో సహకరించిన ఈ పిచ్ పై పరుగుల వరద పారింది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా  480 పరుగుల భారీ స్కోరు చేసింది. ఉస్మాన్ ఖవాజా, కామెరూన్ గ్రీన్ లు సెంచరీలు చేశారు.  ఇక  భారత్ తరఫున ఫస్ట్  ఇన్నింగ్స్ లో  శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీలు   సెంచరీలు బాదారు. ఫలితంగా భారత్ తొలి ఇన్నింగ్స్ లో   571 పరుగుల భారీ స్కోరు సాధించింది.  అనంతరం  రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా.. రెండు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఆ తర్వాత డిక్లేర్డ్ చేసినా  ఫలితం తేలదని ఇరు జట్లు డ్రాకు అంగీకరించాయి.   

 

ఈ విజయంతో భారత్.. బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీని 2-1 తేడాతో గెలుచుకుంది.  భారత్ కు ఇది వరుసగా నాలుగో బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ కావడం గమనార్హం.  అహ్మదాబాద్ టెస్టులో  విరాట్ కోహ్లికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా అశ్విన్, రవీంద్ర జడేజాలకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ఈనెల 17 నుంచి మొదలుకానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios