Asianet News TeluguAsianet News Telugu

ఆమె బౌలింగ్‌లో ఆడడం చాలా కష్టం... టీమిండియా వెటరన్ బౌలర్‌పై రోహిత్ శర్మ...

జులన్ గోస్వామి ఇన్‌స్వింగర్లను ఎదుర్కోవడం చాలా కష్టమంటున్న రోహిత్ శర్మ... ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ తర్వాత రిటైర్మెంట్ తీసుకోబోతున్న జులన్ గోస్వామి... 

Rohit Sharma praises Team India Veteran Bowler Jhulan Goswami, her challenging In-swingers
Author
First Published Sep 20, 2022, 4:58 PM IST

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో ఉన్నాడు. వన్డే ఫార్మాట్‌లో 10 వేల పరుగుల క్లబ్‌లో చేరడానికి చేరువలో ఉన్న రోహిత్ శర్మ, టెస్టుల్లో 3 వేలకు పైగా పరుగులు చేశాడు. అయితే రోహిత్ శర్మ ఓ మహిళా బౌలర్‌ని ఎదుర్కోవడానికి తెగ ఇబ్బంది పడ్డాడట. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు హిట్ మ్యాన్ రోహిత్...

‘నేను జులన్ గోస్వామి ఆటను ఎన్నో ఏళ్లుగా చూస్తున్నాను. ఆమెలో ఉన్న అంకిత భావం ఎందరికో ఆదర్శం. ఆమె వయసు ఎంతో కూడా నాకు తెలీదు, కానీ ఇప్పటికీ తను నెట్ ప్రాక్టీస్ సెషన్స్‌లో ఎంతో కష్టపడడం చూస్తుంటా.. నేను గాయం నుంచి కోలుకుంటూ ఎన్‌సీఏలో శిక్షణ తీసుకుంటున్నప్పుడు కొన్నిసార్లు జులన్ గోస్వామితో మాట్లాడాను...

ఆమె నాకు నెట్స్‌లో బౌలింగ్ కూడా చేసింది. తన ఇన్‌స్వింగర్లను ఎదుర్కోవడం చాలా కష్టం. తన బౌలింగ్‌ని ఫేస్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆమె తరానికి ఒక్క ప్లేయర్... ’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ... 

2022 వన్డే వరల్డ్ కప్ తర్వాత క్రికెట్‌కి దూరంగా ఉంటూ వచ్చిన భారత మహిళా క్రికెట్ జట్టు వెటరన్ ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామి, ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఆడుతోంది. జులన్ గోస్వామికి ఇది ఫేర్‌వెల్ సిరీస్.. 

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో  10 ఓవర్లలో 2 మెయిడిన్లతో 20 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టింది జులన్ గోస్వామి... 39 ఏళ్ల జులన్ గోస్వామి, 2002లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసింది. 20 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతున్న జులన్ గోస్వామి, వుమెన్స్ క్రికెట్‌లో గ్రేటెస్ట్ ఫాస్ట్ బౌలర్లలో ఒకరు...

2018 ఆగస్టులో టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న జులన్ గోస్వామి, తన కెరీర్‌లో 12 టెస్టులు, 199 వన్డేలు, 68 టీ20 మ్యాచులు ఆడింది. వన్డేల్లో 250 వికెట్లు తీసిన ఏకైక, మొట్టమొదటి వుమెన్స్ బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేసిన జులన్ గోస్వామి, మూడు ఫార్మాట్లలో 350 వికెట్లు తీసింది. 

వన్డే వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేసిన జులన్ గోస్వామి, భారత మహిళా క్రికెట్ టీమ్‌కి బౌలింగ్ కన్సల్టెంట్‌గానూ సేవలు అందిస్తోంది. భారత జట్టుకి ప్లేయర్ -కోచ్‌గా ఉన్న జులన్ గోస్వామికి వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో చోటు కల్పించారు సెలక్టర్లు...

జులన్ గోస్వామితో కలిసి ఎన్నో మ్యాచులు ఆడిన భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, ఫేర్‌వెల్ మ్యాచ్ లేకుండానే అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకుంది. 2022 వన్డే వరల్డ్‌లో టీమిండియా పరాజయం తర్వాత ఆమె క్రికెట్‌కి వీడ్కోలు పలికింది. అయితే జులన్ గోస్వామి మాత్రం ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో వీడ్కోలు మ్యాచ్ ఆడుతూ ఘనంగా అంతర్జాతీయ కెరీర్‌కి ముగింపు పలకనుంది...

పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన జులన్ గోస్వామి జీవిత కథ ఆధారంగా విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ప్రధాన పాత్రలో ‘చక్‌దా ఎక్స్‌ప్రెస్’ మూవీ తెరకెక్కుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios