విశాఖపట్నం: వెస్టిండీస్ పై విశాఖపట్నంలో బుధవారం జరిగిన రెండో వన్డే మ్యాచులో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ జోడీ 17 ఏళ్ల క్రితం సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టింది. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా రాహుల్, రోహిత్ జోడీ ఆ రికార్డును తిరగరాసింది. 

రోహిత్ శర్మ, రాహుల్ జోడీ 227 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. దాంతో 17 ఏళ్ల క్రితంనాటి రికార్డు బద్దలైంది. సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ 196 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వెస్టిండీస్ పై రాజ్ కోట్ లో 2002లో జరిగిన వన్డే మ్యాచులో వారు ఈ రికార్డును నెలకొల్పారు.

2019లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా రోహిత్ శర్మ నిలిచాడు. ఈ ఏడాది రోహిత్ శర్మ ఏడో సెంచరీని నమోదు చేసుకున్నాడు. దాంతో విరాట్ కోహ్లీని ఇందులో అధిగమించాడు. 

2019లో రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డేల్లో ఇప్పటి వరకు 1382 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 1292 పరగుులు చేశాడు. విశాఖపట్నంలో వెస్టిండీస్ పై జరిగిన రెండో వన్డేలో విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్ గా వెనుదిరిగిన విషయం తెలిసిందే.