Asianet News TeluguAsianet News Telugu

టీమిండియాకి మరో షాక్... రోహిత్ శర్మకు గాయం! రెండో ఓవర్‌లోనే ఫీల్డ్‌ వదిలి...

ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. 2022లో వన్డేల్లో ఎక్కువ వికెట్లు తీసిన భారత బౌలర్‌గా మహ్మద్ సిరాజ్...

Rohit Sharma injured while fielding in India vs Bangladesh 2nd ODI
Author
First Published Dec 7, 2022, 12:06 PM IST

బంగ్లాదేశ్ పర్యటనలో తొలి వన్డేలో ఓడిన టీమిండియాకి రెండో వన్డేలో ఊహించని షాక్ తగిలింది. రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయంతో క్రీజు వదిలాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ మొదలెట్టిన బంగ్లాదేశ్, ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో 1 పరుగు మాత్రమే రాబట్టగలిగింది...

మహ్మద్ సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో మొదటి రెండు బంతుల్లో రెండు ఫోర్లు బాదాడు అనమోల్ హక్. ఆ తర్వాతి బంతికి 2 పరుగులు వచ్చాయి. మొదటి మూడు బంతుల్లో 10 పరుగులు ఇచ్చేశాడు మహ్మద్ సిరాజ్. నాలుగో బంతికి అనమోల్ ఇచ్చిన క్యాచ్‌ని అందుకునేందుకు ప్రయత్నించిన రోహిత్ శర్మ, చేతికి గాయం చేసుకున్నాడు. 

చేతుల్లో వాలుతున్న బంతిని అందుకోవడంలో చాలా లేటుగా రియాక్ట్ అయిన రోహిత్ శర్మ, క్యాచ్ డ్రాప్ చేయడమే కాకుండా చేతిని బలంగా నేలకు తాకించుకున్నాడు. రోహిత్ శర్మ చేతి నుంచి రక్తం కారడంతో ఫిజియో సలహాతో డగౌట్‌కి చేరుకున్నాడు టీమిండియా కెప్టెన్. రోహిత్ స్థానంలో రజత్ పటిదార్... సబ్‌స్టిట్యూట్‌గా ఫీల్డింగ్‌కి వచ్చాడు. కెప్టెన్ గాయపడడంతో కెఎల్ రాహుల్, స్టాండ్ బౌ కెప్టెన్‌గా నిలిచాడు... రోహిత్ శర్మ బొటన వేలికి అయిన గాయం తీవ్రత తెలుసుకునేందుకు స్కానింగ్‌కి పంపించారు వైద్యులు.. 

రోహిత్ శర్మ గాయపడిన తర్వాతి బంతికే అనమోల్ హక్‌ని అవుట్ చేశాడు మహ్మద్ సిరాజ్. 9 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులు చేసిన అనమోల్ హక్, సిరాజ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యారు. అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బంగ్లా ఓపెనర్ డీఆర్‌ఎస్ తీసుకున్నా, టీమిండియాకి అనుకూలంగానే నిర్ణయం దక్కింది...

ఈ ఏడాది టీమిండియా తరుపున వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు మహ్మద్ సిరాజ్. సిరాజ్ 14 వన్డేల్లో 22 వికెట్లు తీయగా, 14 మ్యాచుల్లో 21 వికెట్లు తీసిన యజ్వేంద్ర చాహాల్‌ని అధిగమించాడు... 6 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది బంగ్లాదేశ్...

తొలి వన్డేలో 31 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 34 పరుగులు చేసిన రోహిత్ శర్మ, చివరిగా జనవరి 2020లో వన్డే సెంచరీ చేశాడు. రెండేళ్లుగా రోహిత్ బ్యాటు నుంచి వన్డే సెంచరీ రాలేదు... ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లోనూ రోహిత్ నిరాశపరిచాడు... రోహిత్ బ్యాటు నుంచి మంచి కెప్టెన్ ఇన్నింగ్స్ చూడాలని కోరుకుంటున్నారు అభిమానులు...

రోహిత్ శర్మ గాయానికి చికిత్స తీసుకుని క్రీజులోకి తిరిగి వస్తాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. రోహిత్ శర్మ బ్యాటింగ్‌కి రాకపోతే టీమిండియా కష్టాలు పెరగొచ్చు. తొలి వన్డేలో వికెట్ తేడాతో ఓడిన భారత జట్టు, మిగిలిన రెండు వన్డేల్లో గెలిస్తే 2-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకోగలుగుతుంది... 

Follow Us:
Download App:
  • android
  • ios