నెట్స్‌లో రోహిత్ శర్మకు బౌలింగ్ చేసి మెప్పించిన మహ్మద్ షమీ... ఆదివారం దాయాది పాకిస్తాన్‌తో తలబడుతున్న టీమిండియా... 

కెప్టెన్ రోహిత్ శర్మకి బ్రహ్మాస్త్రం లాంటి బౌలర్ జస్ప్రిత్ బుమ్రా. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కి బుమ్రాని ఆయుధంలా వాడుతూ వచ్చిన రోహిత్, టీ20 వరల్డ్ కప్‌లోనూ అతనిపై బోలేడు ఆశలు పెట్టుకున్నాడు. అయితే మెగా టోర్నీకి ముందు బుమ్రా గాయం రోహిత్‌ని అయోమయంలో పడేసింది. బుమ్రా గాయపడడంతో అతని ప్లేస్‌లో మహ్మద్ షమీని పొట్టి ప్రపంచ కప్‌కి ఎంపిక చేశారు సెలక్టర్లు...

వాస్తవానికి టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత మహ్మద్ షమీని పూర్తిగా టీ20 ఫార్మాట్‌కి దూరంగా ఉంచింది భారత జట్టు మేనేజ్‌మెంట్. బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహార్‌ వంటి బౌలర్లను పొట్టి ఫార్మాట్‌లో వాడాలని అనుకుంది...

అయితే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు జస్ప్రిత్ బుమ్రా, దీపక్ చాహార్ గాయపడడం.. భారీ అంచనాలు పెట్టుకున్న ఆవేశ్ ఖాన్ పెద్దగా రాణించకపోవడం టీమిండియాపై తీవ్రంగా ప్రభావం చూపాయి. దీంతో మరో దారి లేక, టీ20లకు దూరంగా పెట్టిన మహ్మద్ షమీని మళ్లీ పొట్టి ఫార్మాట్ ఆడించాల్సిన పరిస్థితి...

ఆసియా కప్ టోర్నీ తర్వాత ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో టీ20 సిరీస్‌లకు మహ్మద్ షమీని ఎంపిక చేసినా, అతనికి కరోనా సోకడంలో ఆడించే అవకాశం దక్కలేదు. ఐపీఎల్ 2022 సీజన్ తర్వాత ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడకుండానే ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కాడు మహ్మద్ షమీ...

Scroll to load tweet…

ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చి 3 వికెట్లు తీసి అదరగొట్టిన మహ్మద్ షమీ, నెట్ సెషన్స్‌లో రోహిత్ శర్మను భయపెట్టాడట... నెట్స్‌లో రోహిత్‌కి మహ్మద్ షమీ బౌలింగ్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఐసీసీ...

ఇందులో సీనియర్ పేసర్ షమీ బౌలింగ్‌ని ఎదుర్కొన్న రోహిత్ శర్మ... ‘యో తో డేంజరస్ బౌలర్ హై భాయ్... సబ్ సే డేంజర్’ (ఇతను చాలా డేంజరస్ బౌలర్... అందరికంటే డేంజర్) అంటూ వ్యాఖ్యానించాడు. ఇన్ స్వింగర్లతో రోహిత్‌నే భయపెట్టాడు మహ్మద్ షమీ... ఇప్పటికే పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఎవరిని ఆడించాలనే విషయంపై తనకు పూర్తి క్లారిటీ ఉందని వ్యాఖ్యానించిన రోహిత్, మహ్మద్ షమీకి తుది జట్టులో చోటు కల్పిస్తాడా? లేక బుమ్రా, హర్షల్ , అర్ష్‌దీప్ సింగ్‌లను ఆడిస్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది...

ఆదివారం, అక్టోబర్ 23న మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కి 90 వేలకు పైగా ప్రేక్షకులు హాజరుకాబోతున్నారు. అయితే ఆదివారం మెల్‌బోర్న్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే రెండు రోజుల క్రితం 80 శాతం వాన పడే అవకాశం ఉండగా శనివారం నాటికి అది 10 శాతానికి తగ్గిపోయింది. ఇది మ్యాచ్‌పై ఇంట్రెస్ట్ పెంచేందుకు క్రికెట్ వర్గాలు చేస్తున్న మార్కెట్ స్ట్రాటెజీ ఆ.. లేక వరుణుడి అంతరాయం లేకుండా మ్యాచ్ సజావుగా సాగుతుందా? అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది..