ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.30 లక్షలకు అర్జున్ టెండూల్కర్‌ను కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్... సచిన్ కుమారుడిని కుశల ప్రశ్నలు అడిగిన రోహిత్ శర్మ...

ఐపీఎల్ 2021 సీజన్‌ నుంచి వేలంలో హాట్ టాపిక్ అవుతున్నాడు సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్. ‘మాస్టర్’ సచిన్ టెండూల్కర్ కొడుకు కావడంతో ముంబై ఇండియన్స్, అర్జున్ టెండూల్కర్‌ని కొనుగోలు చేసిందని, అదే మొత్తం సత్తా ఉన్న ఓ యువ క్రికెటర్ కోసం ఖర్చు పెడితే.. అతని కెరీర్‌కి అది ఉపయోగపడుతుందనేది క్రికెట్ ఫ్యాన్స్ వాదన...

అయితే ముంబై ఇండియన్స్ మాత్రం సచిన్ టెండూల్కర్ కొడుకు కావడం వల్ల అర్జున్ టెండూల్కర్‌ని కొనుగోలు చేయలేదని... నెట్ బౌలర్‌గా అతని టాలెంట్‌ని గుర్తించడం వల్లే కొనుగోలు చేశామని క్లారిటీ ఇస్తూ వస్తోంది. ఐపీఎల్ 2021 సీజన్ మెగా వేలంలో ఆఖరిగా వేలానికి వచ్చిన అర్జున్ టెండూల్కర్, 2022 మెగా వేలంలోనూ ఆఖర్లో మెరిశాడు...

బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకు ముంబై ఇండియన్స్, అర్జున్ టెండూల్కర్ కొనుగోలు చేసేందుకు చూడగా... గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రా కారణంగా మరో 10 లక్షల రూపాయలు అదనంగా పొందాడు అర్జున్. పర్సులో కేవలం రూ.35 లక్షలు మాత్రమే ఉన్న సమయంలో కూడా అర్జున్ టెండూల్కర్ కోసం రూ.25 లక్షలకు కోట్ చేసింది గుజరాత్ టైటాన్స్. దీంతో మరో రూ.5 లక్షలు పెంచి, రూ.30 లక్షలకు అర్జున్ టెండూల్కర్‌ను తిరిగి కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్...

గత సీజన్‌లో బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకు ముంబై ఇండియన్స్‌లో చేరిన అర్జున్ టెండూల్కర్, ఏ మ్యాచ్ ఆడింది లేదు. తుది జట్టులో కాదు కదా, కనీసం ముంబై ఇండియన్స్ మ్యాచులు ఆడిన సమయంలో స్టేడియంలో కూడా కనిపించలేదు అర్జున్ టెండూల్కర్. 

YouTube video player

తాజాగా ఐపీఎల్ 2022 సీజన్‌ కోసం ముంబై ఇండియన్స్ ఏర్పాటు చేసిన క్యాంపుకి హాజరయ్యాడు అర్జున్ టెండూల్కర్. ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ, ప్రత్యేకంగా అర్జున్ టెండూల్కర్‌ను గ్రీట్ చేశాడు. ముంబై ఇండియన్స్ ప్లేయర్ల కోసం ‘ఏంఐ అరేనా’ పేరుతో బయో బబుల్ జోన్‌ను ఏర్పాటు చేసింది ఫ్రాంఛైజీ...

‘వన్ అండ్ ఓన్లీ అర్జున్ టెండూల్కర్...’ అంటూ సచిన్ తనయుడి భుజాన్ని తట్టి విష్ చేసిన రోహిత్ శర్మ, ‘ఇంట్లో అందరూ బాగున్నారా... నాన్న... అమ్మ... అక్క’ అంటూ కుశల ప్రశ్నలు అడిగాడు. అందరూ బాగున్నారని చెప్పిన అర్జున్ టెండూల్కర్, అక్క గురించి అడిగేసరికి... కాస్త సీరియస్‌గా ముఖం పెట్టి, తను ఇంగ్లాండ్‌లో ఉందని చెప్పడం విశేషం... 

క్వారంటైన్ పూర్తి చేసుకుని ముంబై ఇండియన్స్ క్యాంపులో చేరిన ఆల్‌రౌండర్ కిరన్ పోలార్డ్‌ను ఆత్మీయంగా హత్తుకుని స్వాగతించాడు రోహిత్ శర్మ. అలాగే ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా, యంగ్ బౌలర్లతో మాట్లాడుతూ కనిపించాడు. ముంబై ఇండియన్స్ ఏర్పాటు చేసిన విందును అందరూ కలిసి ఖాళీ చేయాలంటూ ఆఖర్లో ప్లేయర్లకు తన స్టైల్‌లో స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు ఫైవ్ టైం ఐపీఎల్ టైటిల్ విన్నింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ. భారత జట్టు కెప్టెన్‌గా పూర్తి స్థాయి బాధ్యతలు అందుకున్న తర్వాత జరుగుతున్న తొలి ఐపీఎల్ సీజన్ కావడంతో రోహిత్ శర్మపై భారీ అంచనాలున్నాయి.