అంతర్జాతీయ క్రికెట్ లో ప్రస్తుతం బెస్ట్ ఓపెనర్ ఎవరంటే ముందుగా గుర్తొచ్చే పేరు రోహిత్ శర్మ. వీరేంద్ర సెహ్వాగ్ మాదిరిగానే మొదటిబంతి నుండే  ఎదురుదాడికి దిగి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టడంలో రోహిత్ దిట్ట. ఇక ఒక్కసారి అతడు క్రీజులో కుదరుకున్నాడంటే ఆపడం ఎవరితరం కాదు. ఇలా ఇంతకాలం పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రమే మెరుపులు మెరిపించిన రోహిత్ టెస్టు ఓపెనర్ గా సత్తాచాటి పరిపూర్ణమైర ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గా మారిపోయాడు. 

తన అమ్మమ్మగారి వూరయిన విశాఖపట్నంలోనే రోహిత్ కు మొదటిసారి టెస్ట్ ఓపెనింగ్ చేసే అవకాశం లభించింది. చిన్నప్పుడు సరదాగా గడిపిన అదే గడ్డపై అతడు ఎంతో కసితో ఆడాడు. ప్రత్యర్థి సౌతాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపిస్తూ మొదటిటెస్ట్ లో ఏకంగా 176 బాదాడు. ఇలా వైజాగ్ టెస్ట్ లో మయాంక్ తో కలిసి అతడు ఏకంగా 317 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదుచేసి భారత్ ను పటిష్టమైన స్థానంలో నిలబెట్టాడు. 

మొదటిరోజే సెంచరీని పూర్తిచూసుకున్న రోహిత్ ఇవాళ(రెండోరోజు) మరో 76 పరుగులు జోడించి ఔటయ్యాడు. 176 పరుగుల వద్ద అతడు కేశవ్ మహరాజ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఇలా ఔటై పెవిలియన్ కు వెళుతుండగా  మైదానంలోని అభిమానులే కాదు ఆటగాళ్ల బృందం కూడా స్టాండింగ్ ఓవేషన్ తో రోహిత్ ను గౌరవించారు. మరీముఖ్యంగా కెప్టెన్ కోహ్లీ అయితే రోహిత్ వస్తున్నంతసేపు  చప్పట్లు కొడుతూ దగ్గరకు రాగానే భుజం తట్టి అభినందించారు. ఇది అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. 

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు గతకొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. రోహిత్ ను కావాలనే పదేపదే జట్టుకు దూరం పెడుతున్నట్లు కోహ్లీపై ఆరోపణలు కూడా వచ్చాయి. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్వయంగా వారే చెప్పినా ఈ ప్రచారం మాత్రం ఆగలేదు. అయితే తాజాగా రోహిత్ భారీ స్కోరు సాధించినందుకు కోహ్లీ అభినందించిన విధానాన్ని చూస్తే వారిద్దరి మధ్య గొడవలేమీ లేనట్లు తేటతెల్లమవుతోంది. కాబట్టి ఇకనైనా వారిద్దరి మధ్య కోల్డ్ వార్ కొనసాగుతున్నట్లు జరుగుతున్న ప్రచారానికి తెరపడుతుందేమో చూడాలి. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

🔝knock from @rohitsharma45 👏🏻👏🏻 The dressing room acknowledges #TeamIndia 🇮🇳 #INDvSA

A post shared by Team India (@indiancricketteam) on Oct 2, 2019 at 10:44pm PDT