Asianet News TeluguAsianet News Telugu

గజినీ రోహిత్! ‘సారీ సర్... మరిచిపోయా...’ టాస్ సమయంలో మతిమరుపుతో రోహిత్ శర్మ...

టాస్ సమయంలో మతిమరుపుతో ఇబ్బందిపడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ... నిర్ణయం చెప్పడానికి 13 సెకన్ల సమయం తీసుకున్న హిట్ మ్యాన్.. 

Rohit Sharma forgets what to say after winning toss against New Zealand in 2nd ODI CRA
Author
First Published Jan 21, 2023, 1:39 PM IST

విరాట్ కోహ్లీ తర్వాత ఆ రేంజ్ ఫాలోయింగ్ తెచ్చుకున్న క్రికెటర్ రోహిత్ శర్మ. వన్డేల్లో రికార్డు స్థాయిలో మూడు డబుల్ సెంచరీలు బాదిన రోహిత్ శర్మ, ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ముంబై ఇండియన్స్‌కి 8 సీజన్లలో ఐదు టైటిల్స్ అందించాడు. ఐపీఎల్ రికార్డు కారణంగానే విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి బలవంతంగా తప్పించి, ఆ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించింది బీసీసీఐ...

తనపై పెట్టుకున్న భారీ అంచనాలను ఇప్పటిదాకా అయితే అందుకోలేకపోయిన రోహిత్ శర్మ, స్వదేశంలో జరుగుతున్న ద్వైపాక్షిక సిరీసుల్లో మాత్రం వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. హైదరాబాద్‌లో జరిగిన తొలి వన్డేలో 12 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకున్న భారత జట్టు, రాయిపూర్ వేదికగా రెండో వన్డే ఆడుతోంది...

రెండో వన్డేలో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ, ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే టాస్ సమయంలో జరిగిన ఓ ఫన్నీ సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాయిన్ తీసుకుని టాస్ వేసిన రోహిత్ శర్మ, కాసేపు గజినిలా మతిమరుపుతో ఇబ్బంది పడ్డాడు...

కామెంటేటర్‌గా వచ్చిన మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి చెప్పగానే రోహిత్ టాస్ వేయడం, గెలవడం జరిగిపోయాయి. మ్యాచ్ రిఫరీగా వ్యవహరిస్తున్న భారత మాజీ క్రికెటర్ జవగళ్ శ్రీనాథ్, రోహిత్ టాస్ గెలిచావు, ఏం ఎంచుకుంటున్నావ్...  అని అడిగాడు...

దానికి ఏం చెప్పాలో మరిచిపోయిన రోహిత్ శర్మ, ‘ఆ...ఆ... ’ అని నాన్చుతూ ‘ఫీల్డింగ్ చేస్తామ్...’ అని చెప్పాడు. రోహిత్ సమాధానం చెప్పడానికి 13 సెకన్లు తీసుకున్నాడు. ఈ సమయంలో న్యూజిలాండ్ తాత్కాలిక కెప్టెన్ టామ్ లాథమ్ కూడా రోహిత్ మతిమరుపుతో పడుతున్న ఇబ్బంది చూసి ముసిగి నవ్వుకున్నాడు...

తన మతిమరుపు గురించి రవిశాస్త్రితో మాట్లాడిన సమయంలో చెప్పాడు రోహిత్ శర్మ. ‘టాస్ గెలవగానే ఏం చేయాలనుకున్నామో మరిచిపోయా. అందుకే చాలా సేపు ఆలోచించా. టాస్ గెలిస్తే ఏం చేయాలనే దానిపై చాలా చర్చ జరిగింది. అందుకే పాయింట్ గుర్తుకురాలేదు..  

మొదటి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేశాం, అందుకే ఇక్కడ చేధించాలని అనుకుంటున్నాం. టీమ్‌కి ఛాలెంజ్‌లు కొత్తేమీ కాదు. రెండో ఇన్నింగ్స్‌లో ఫ్లడ్ లైట్స్‌లో బ్యాటింగ్ అంత ఈజీయేం కాదు, అయితే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి టీమ్ సిద్ధంగా ఉండాలి. ప్రాక్టీస్ సెషన్స్‌లో సాయంత్రం సమయంలో తేమ రావడం గమనించాం. అది కూడా మాకు సహకరిస్తుందని అనుకుంటున్నాం...’ అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ...

రోహిత్ శర్మ మతిమరుపు గురించి గతంలో విరాట్ కోహ్లీ  చాలాసార్లు కామెంట్లు చేశాడు. రోహిత్ అన్ని మరిచిపోతుండని ఇంటర్వ్యూల్లో బయటపెట్టాడు. అయితే క్రికెట్ ఫ్యాన్స్‌కి ఇలా దొరికిపోవడం మాత్రం ఇదే తొలిసారి.. 

Follow Us:
Download App:
  • android
  • ios