తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 574 పరుగుల భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత జట్టు... 175 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన రవీంద్ర జడేజా...

టెస్టు కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఆడుతున్న రోహిత్ శర్మ, షాకింగ్ నిర్ణయంతో జడ్డూ ఫ్యాన్స్‌ ఆగ్రహానికి గురయ్యేలా ఉన్నాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు 129.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 574 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది...

రవీంద్ర జడేజా 228 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్సర్లతో 175 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. డబుల్ సెంచరీకి 25 పరుగుల దూరంలో ఉన్న జడ్డూ, మరో ఐదు ఓవర్లలో ద్విశతకాన్ని అందుకునేవాడే. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ షాకింగ్ నిర్ణయంతో జడ్డూ, టెస్టు డబుల్ సెంచరీని మిస్ చేసుకోవాల్సి వచ్చింది...

రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీలతో కలిసి ఆరు, ఏడో, 9వ వికెట్లకు శతాధిక భాగస్వామ్యం నెలకొల్పిర రవీంద్ర జడేజా... ఈ ఫీట్ సాధించిన ఐదో భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఇంతకుముందు వినోద్ కాంబ్లీ, రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్, కరణ్ నాయర్ ఈ ఫీట్ సాధించారు... 

కెప్టెన్ రోహిత్ శర్మ 28 బంతుల్లో 6 ఫోర్లతో 29 పరుగులు చేసి అవుట్ కాగా మయాంక్ అగర్వాల్ 49 బంతుల్లో 5 ఫోర్లతో 33 పరుగులు చేశాడు. వందో టెస్టు ఆడుతున్న మాజీ సారథి విరాట్ కోహ్లీ 76 బంతుల్లో 5 ఫోర్లతో 45 పరుగులు చేయగా, హనుమ విహారి 128 బంతుల్లో 5 ఫోర్లతో 58 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు...

వికెట్ కీపర్ రిషబ్ పంత్ 97 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 96 పరుగులు చేసి అవుట్ కాగా శ్రేయాస్ అయ్యర్ 48 బంతుల్లో 3 ఫోర్లతో 27 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. రవిచంద్రన్ అశ్విన్ 82 బంతుల్లో 8 ఫోర్లతో 61 పరుగులు చేయగా, జయంత్ యాదవ్ 18 బంతుల్లో 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

భారత ఇన్నింగ్స్‌లో 10 మంది ప్లేయర్లు బ్యాటింగ్ చేయగా కేవలం జయంత్ యాదవ్ ఒక్కడే సింగిల్ డిజిట్ స్కోరు నమోదు చేయడం విశేషం. రవీంద్ర జడేజా 175 పరుగులు చేసి టెస్టుల్లో రెండో సెంచరీ నమోదు చేయడమే కాకుండా భారత మాజీ సారథి కపిల్ దేవ్ తర్వాత 5 వేల అంతర్జాతీయ పరుగులు, 400+ వికెట్లు పడగొట్టిన భారత ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...

బ్యాటింగ్ ఆర్డర్‌లో ఏడు, అంతకంటే కింద బ్యాటింగ్‌కి వచ్చి అత్యధిక స్కోరు నమోదు చేసిన భారత బ్యాటర్‌గా టాప్‌లో నిలిచాడు రవీంద్ర జడేజా. ఇంతకుముందు 1986లో శ్రీలంకపై కపిల్‌దేవ్ 163 పరుగులు చేయగా, జడ్డూ ఆ రికార్డును అధిగమించాడు. 

మహ్మద్ షమీ కూడా 34 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. శ్రీలంక బౌలర్లలో సురంగ లక్మల్, విశ్వ ఫెర్నాండో, లసిత్ ఎంబూల్దేనియా రెండేసి వికెట్లు తీయగా లహిరు కుమార, ధనంజయ డి సిల్వలకు చెరో వికెట్ దక్కింది.