శ్రీలంక క్రికెటర్, యార్కర్ స్పెషలిస్ట్ లసిత్ మలింగ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఇంగ్లాండ్ లో ముగిసిన ప్రపంచ కప్ తర్వాత అతడు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ప్రచారం జరిగింది. అయితే అదికాస్త ఆలస్యమై బంగ్లాదేశ్ తో స్వదేశంలో జరిగిన సీరిస్ ద్వారా రిటైరయ్యాడు. అయితే అతడి రిటైర్మెంట్ పై టీమిండియా వైస్ కెప్టెన్, ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ  స్పందించాడు. 

'' గత  దశాబ్ద కాలంగా మ్యాచ్ విన్నర్లుగా నిలిచిన ఆటగాళ్లలో ఎవరు బెస్ట్ అని నన్ను  అడిగితే...తప్పకుండా మలింగ పేరే చెబుతా. అతడు మ్యాచ్ విన్నర్లలందరికి టాప్ అనడానికి ఎలాంటి  సందేహం లేదు. ఓ కెప్టెన్ గా(ఐపిఎల్ లో ముంబై ఇండియన్స్ కి) క్లిష్ట పరిస్థితుల్లో వున్నపుడు అతడు గట్టెక్కించిన సందర్భాలు అనేకం.   అతడిపై నమ్మకం పెట్టుకున్న ప్రతిసారి అతడు బంతితో మాయ చేశాడు. అతడు జట్టులో వుండటమే మాకెంతో బలాన్నిస్తుంది. భవిష్యత్ లో కూడా అతడికి  అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా.''  అంటూ మలింగ రిటైర్మెంట్ పై రోహిత్ స్పందించాడు. 

రోహిత్ శర్మ సారథ్యంలో మలింగ ముంబై ఇండియన్స్ టీం తరపున ఐపిఎల్ ఆడే విషయం అందరికి తెలిసిందే. దీంతో వీరిద్దరి మధ్య మంచి అనుబంధం  వుంది. అందువల్లే  మలింగ రిటైర్మెంట్ పై రోహిత్ ప్రత్యేకంగా స్పందించాడు. ఇక ఇదే జట్టుకు చెందిన మరో బౌలర్  బుమ్రా కూడా మలింగ రిటైర్మెంట్ పై ట్వీట్ చేశాడు. 
'' ఓ అద్భుతమైన బౌలర్ గా క్రికెట్ కు మీరు చేసిన సేవలు చాలా గొప్పవి. మీరో క్లాసిక్ బౌలర్. మీరంటూ నాకు ఎప్పుడూ అభిమానమే.  దాన్ని ఎప్పటికీ అలాగే కొనసాగిస్తాను.'' అని బుమ్రా పేర్కొన్నాడు.  

శుక్రవారం కొలంబో వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్ మలింగ తన కెరీర్లో ఆడిన చివరి వన్డే.  ఈ మ్యాచ్ అనంతరం మలింగ మాట్లాడుతూ... గత 15 సంవత్సరాలు శ్రీలంక క్రికెట్ కు తన సేవలు అందించాను. ఇక తాను తప్పుకుని యువకులను అవకాశాలివ్వాలని భావిస్తున్నా. అందుకోసమే వన్డే ఫార్మాట్ నుండి తప్పుకుంటున్నాను అని ప్రకటించారు.