టీం ఇండియా క్రికెటర్ రోహిత్ శర్మకు కోపం వచ్చింది.  తమను వర్షంలో నడిచేలా చేశారని... పోలీసులపై రోహిత్ శర్మ మండిపడ్డారు. ఈ సంఘటన విశాఖ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.

ఇంతకీ మ్యాటరేంటంటే...దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్‌లో విజయం సాధించిన కోహ్లీ బృందం పుణె వెళ్లేందుకు సోమవారం మధ్యాహ్నం 2.20కి ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఆ సమయంలో అక్కడ వర్షం కురుస్తోంది. పైకప్పులేని మూడో ప్లాట్‌ఫాంవద్ద తమ జట్టు బస్సు ఆగడంతో భారత క్రికెటర్లు, వారి కుటుంబ సభ్యులు వర్షంలో తడుచుకుంటూ ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్లాల్సి వచ్చింది. 

కెప్టెన్‌ కోహ్లీ తదితరులు తమ బ్యాగ్‌లను తలపై ఉంచుకొని పరుగుపరుగున లోపలికి వెళ్లారు. ఒకటో ప్లాట్‌ఫాంకు పైకప్పు ఉన్నా అప్పుడు అక్కడ సౌతాఫ్రికా జట్టు ఉండడంతో టీమిండియా బస్సును మూడో ప్లాట్‌ఫాం వద్దకు తీసుకొచ్చారు. దీనిపై స్థానిక పోలీసు అధికారిని రోహిత్‌ శర్మ నిలదీశాడు. ఆ అధికారి సమాధానం చెబుతుండగా వర్షంలో నడిపిస్తారా అంటూ అసహనం వ్యక్తం చేస్తూ వేగంగా బస్సు దిగి ఎయిర్‌పోర్టులోకి వెళ్లిపోయాడు.