తాను బాల్కనీ నుంచి దూకి చచ్చిపోదామని అనుకున్నానంటూ క్రికెటర్ రాబిన్ ఉతప్ప షాకింగ్ కామెంట్స్ చేశారు. రెండేళ్ల పాటు తనకి అవే ఆలోచనలు ఉన్నాయని... ఆ సమయంలో తాను నరకం అనుభవించానంటూ అతను చెప్పడం గమనార్హం.

ఒకనొక దశలో బాల్కనీ నుంచి దూకేద్దామనే స్థితికి వెళ్లా.. కానీ, అలా చేయకుండా ఏదో శక్తి అడ్డుకొందన్నాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున రాబిన్‌ ఆడుతున్నాడు. రాయల్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన ‘మనసు, శరీరం, ఆత్మ’ కార్యక్రమం లైవ్‌ సెషన్‌లో తాను ఎదుర్కొన్న మానసిక సమస్యల గురించి ఊతప్ప మాట్లాడాడు. 

‘2009-11 మధ్య మానసికంగా దారుణ స్థితిని అనుభవించా. నా ఆలోచనలన్నీ ఆత్మహత్య చుట్టూ తిరుగుతుండేవి. బాల్కనీ నుంచి దూకేయాలని అనిపించేది. కానీ, ఏదో అదృశ్యశక్తి ఆపేది’ అని చెప్పాడు. టీమిండియాలో చోటు దక్కని దశలో ఇదంతా జరిగిందన్నాడు. ఇతరుల సహాయంతో కుంగుబాటు నుంచి బయటపడ్డానన్నాడు. 

‘భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ తీవ్రంగా బాధపడేవాడిని. ఒక రోజు తీవ్ర బాధతో బాల్కనీ నుంచి దూకాలనుకున్నాను. కానీ ఎదో శక్తి నన్ను వెనక్కు నెట్టింది.క్రమేపీ నాకు నేనుగా మెరుగుపడుతూ ఆ ఆలోచనలు నుంచి బయటకొచ్చా. ఇప్పుడు కేవలం క్రికెట్‌పైనే దృష్టి పెట్టడం లేదు. పలు విషయాలపై దృష్టి సారిస్తూ నా మనసును ప్రశాంతంగా ఉంచగలుగుతున్నాను. నేను వెళ్లే మార్గం సరైనదా.. కాదా అని అన్వేషించుకుంటూ నా రోటీన్‌ లైఫ్‌లో ముందుకు సాగుతున్నా' అని ఊతప్ప తెలిపాడు. ఇక ఊతప్ప తన అంతర్జాతీయ కెరీర్‌లో 46 వన్డేలు, 13 టీ20లు ఆడాడు.