Robin Uthappa Retirement: టీమిండియా వెటరన్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప  రిటైర్మెంట్ ప్రకటించాడు.  అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు అతడు  ట్విటర్ ద్వారా తెలిపాడు. 

సుదీర్ఘకాలం పాటు క్రికెట్ కు సేవలందించిన టీమిండియా వెటరన్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప సంచలన నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్టు బుధవారం ట్విటర్ వేదికగా ప్రకటించాడు. కర్నాటకకు చెందిన 36 ఏండ్ల ఊతప్ప.. 20 ఏండ్లుగా భారత క్రికెట్ తో ఉన్న అనుబంధానికి ముగింపు పలికాడు. ఈ మేరకు అతడు ట్వీట్ చేస్తూ ఈవిషయాన్ని వెల్లడించాడు. 2007 టీ20 ప్రపంచకప్ లో భారత విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ మాజీ ఓపెనర్.. టీమిండియా కంటే ఫ్రాంచైజీ క్రికెట్ ద్వారా అభిమానులకు దగ్గరయ్యాడు. 

ట్విటర్ వేదికగా ఊతప్ప స్పందిస్తూ.. ‘నా సొంత రాష్ట్రం కర్నాటక తో పాటు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఏదేమైనా ప్రతీదానికి ఒక ముగింపు ఉండాలి. కృతజ్ఞతతో కూడిన హృదయంతో నేను భారత క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను..’ అని పేర్కొన్నాడు. 

Scroll to load tweet…

ట్విటర్ లో రెండు పేజీల సుదీర్ఘ లేఖ రాసి భారత క్రికెట్ తో తనకున్న అనుబంధాన్ని అందులో పంచుకున్నాడు ఊతప్ప. ‘నేను ప్రొఫెషనల్ క్రికెట్ ఆడటం ప్రారంభించి 20 సంవత్సరాలు అయ్యింది. ఎన్నో ఎత్తు పల్లాలతో కూడిన ప్రయాణం ఇది. అత్యంత సంతృప్తికరంగా, ఆనందంగా ప్రతి క్షణాన్ని నేను ఎంజాయ్ చేశాను. ఒక మంచి మనిషిగా ఎదగడానికి ఇది (క్రికెట్)నాకు తోడ్పడింది..’ అని లేఖలో రాసుకొచ్చాడు. 

ఇక ఊతప్ప కెరీర్ విషయానికొస్తే.. భారత జట్టు తరఫున 2006-15 మధ్య 46 వన్డేలు ఆడిన అతడు 934 పరుగులు చేశాడు.ఇందులో 6 హాఫ్ సెంచరీలున్నాయి. 12 టీ20లలో 249 పరుగులు సాధించాడు. జాతీయ జట్టు తరఫున పెద్దగా రాణించలేకపోయినా ఐపీఎల్ లో మాత్రం ఊతప్ప మెరుపులు మెరిపించాడు. తన ఐపీఎల్ కెరీర్ లో 205 మ్యాచ్ లు ఆడి 27 హాఫ్ సెంచరీల సాయంతో 4,952 పరుగులు చేశాడు. ఓపెనర్ గా దూకుడుగా ఆడే ఊతప్ప.. సీఎస్కే, కేకేఆర్, ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్, ఆర్సీబీ, పూణే వారియర్స్ తరఫున ఆడాడు. మూడు సార్లు ట్రోఫీ నెగ్గిన (సీఎస్కే 2, కేకేఆర్1) జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఊతప్ప చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడిగా 2022 సీజన్ లో ఆడాడు.

Scroll to load tweet…

Scroll to load tweet…