Asianet News TeluguAsianet News Telugu

చితక్కొట్టిన టెండూల్కర్, యువరాజ్ సింగ్... ఇండియా లెజెండ్స్‌కి రెండో విజయం...

ఇంగ్లాండ్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో ఇండియా లెజెండ్స్ గెలుపు... 20 బంతుల్లో 40 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్..

Road Safety World series Season 2: India legends beats England legends, Sachin Tendulkar scores
Author
First Published Sep 23, 2022, 11:43 AM IST

రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022 టోర్నీలో ఇండియా లెజెండ్స్ రెండో విజయాన్ని అందుకుంది. ఇంగ్లాండ్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో గెలుపొందింది టెండూల్కర్ టీమ్. వర్షం అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్‌ని 15 ఓవర్లకు కుదించారు అంపైర్లు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్ టీమ్, 15 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది...


వికెట్ కీపర్ నమన్ ఓజా, సచిన్ టెండూల్కర్ కలిసి తొలి వికెట్‌కి 65 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 17 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేసిన నమన్ ఓజా అవుటైన తర్వాత కొద్దిసేపటికే సచిన్ టెండూల్కర్ కూడా పెవిలియన్ చేరాడు...

20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్, తన ట్రేడ్ మార్క్ క్లాసిక్ షాట్స్‌తో 20 ఏళ్ల కిందట మాస్టర్ బ్లాస్టర్ పర్పామెన్స్‌ని గుర్తుకు తెచ్చాడు. 49 ఏళ్ల వయసులో సచిన్ టెండూల్కర్ కొట్టిన సిక్సర్లు, మాస్టర్ అభిమానులకు ఆనాటి రోజులను గుర్తుకు తెచ్చాయి.

సురేష్ రైనా 8 బంతుల్లో ఓ ఫోర్,  సిక్సర్‌తో 12 పరుగులు చేసి అవుట్ కాగా యూసఫ్ పఠాన్ 11 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 27 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. స్టువర్ట్ బిన్నీ 11 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 18 పరుగులు చేయగా యువరాజ్ సింగ్ 15 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 31 పరుగులు, ఇర్ఫాన్ పఠాన్ 9 బంతుల్లో ఓ సిక్సర్‌తో 11 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.

ఇంగ్లాండ్ లెజెండ్స్ బౌలర్ స్టీఫెన్ పారీ 3 వికెట్లు తీశాడు. 171 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ లెజెండ్స్.. 15 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 130 పరుగులకే పరిమితమైంది. డిమిత్రి మస్కరెన్హస్ 12 పరుగులు చేయగా ఫిల్ మస్టర్డ్ 29 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ లెజెండ్స్ కెప్టెన్ ఇయాన్ బెల్ 12 పరుగులు చేసి అవుట్ కాగా రిక్కీ క్లార్క్ 9, టిమ్ అంబ్రోస్ 16, జేమ్స్ టిండాల్ 2 చేసి అవుట్ కాగా క్రిస్ స్కోఫీల్డ్ 19, క్రిస్ ట్రెంలెట్ 24 పరుగులతో అజేయంగా నిలిచారు...

భారత బౌలర్లలో రాజేశ్ పవార్ 3 ఓవర్లలో 12 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా స్టువర్ట్ బిన్నీ, ఓజా, మన్‌ప్రీత్ గోనీ తలా ఓ వికెట్ తీశారు. వర్షం కారణంగా వెస్టిండీస్ లెజెండ్స్, న్యూజిలాండ్స్ లెజెండ్స్‌ జట్లతో ఇండియా లెజెండ్స్ ఆడాల్సిన మ్యాచులు ఫలితం తేలకుండానే రద్దయ్యాయి. తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా లెజెండ్స్‌పై విజయం అందుకున్న డిఫెండింగ్ ఛాంపియన్ భారత లెజెండ్స్‌కి ఇది రెండో విజయం.. 
 

Follow Us:
Download App:
  • android
  • ios