2020వ సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న పురస్కారానికి టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఎంపికైన సంగతి తెలిసిందే. దీంతో క్రీడా ప్రముఖులు, ఆయన అభిమానులు హిట్ మ్యాన్‌కు అభినందలు తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలో రోహిత్ శర్మ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలిపారు. మీ ప్రేమ, అభిమానంతో దేశానికి ఇంకా ఎన్నో విజయాలను చేకూరుస్తానని రోహిత్ హామీ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్.. రోహిత్‌ను సరదాగా ఆటపట్టించాడు. ‘‘ గులాబ్ జామ్‌లతో నీ నోరంతా నిండిపోతుంటే నువ్వు  ఎలా మాట్లాడగలుగుతున్నావంటూ రోహిత్ పోస్ట్‌కు కామెంట్ పెట్టాడు.

అలాగే దానిని హిట్ మ్యాన్ భార్య రితికాకు ట్యాగ్ చేశాడు. దీనికి రితిక వెంటనే స్పందించింది. ‘‘ మీరు ఈ ఖేల్‌రత్నను ఇంకా ఏడిపించాలి’’ అంటూ రిప్లై ఇచ్చింది.

2020వ సంవత్సరానికి గాను రోహిత్ శర్మ, రెజ్లర్ వినేశ్ ఫోగాట్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనికా బాత్రా, పారాలింపిక్ సర్ణ విజేత మరియప్పన్ తంగవేలు, భారత హాకీ కెప్టెన్ రాణి రాంపాల్‌లు రాజీవ్ గాంధీ ఖేల్‌రత్నకు ఎంపికయ్యారు.

కాగా యూఏఈలో జరనున్న ఐపీఎల్ కోసం రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టుతో కలిసి దుబాయ్ చేరుకున్నాడు. తన భార్య రితికా, కుమార్తె సమైరాతో కలిసి రోహిత్ యూఏఈ వెళ్లాడు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్ ప్రకారం.. యూఏఈకి వచ్చిన  తర్వాత ఆటగాళ్లంతా తప్పనిసరిగా ఏడు రోజులు క్వారంటైన్‌లో ఉండాలి.

భారతదేశంలో కరోనా విజృంభణ కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌ను యూఏఈకి తరలించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఐపీఎల్ జరగనున్నది.