Asianet News TeluguAsianet News Telugu

కోలుకుంటున్న రిషబ్ పంత్... మెరుగైన వైద్యం కోసం ముంబైకి! ఆ తర్వాత విదేశాలకు...

నాలుగు రోజులుగా డెహ్రాడూన్‌లో చికిత్స తీసుకుంటున్న రిషబ్ పంత్... మెరుగైన చికిత్స కోసం ముంబైకి! అవసరమైతే విదేశాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న బీసీసీఐ... 

Rishabh Pant will be shifted to mumbai for further treatment, Says DDCA Director
Author
First Published Jan 4, 2023, 1:25 PM IST

ఢిల్లీలో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం డెహ్రాడూన్‌లో చికిత్స పొందుతున్న రిషబ్ పంత్‌ని మెరుగైన చికిత్స కోసం ముంబైకి తరలిస్తున్నట్టు తెలిపాడు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) డైరెక్టర్ శ్యామ్ శర్మ...

‘రిషబ్ పంత్‌ని ముంబైకి తరలిస్తున్నాం. అక్కడ అతని ఎముక గాయాలకు చికిత్స జరుగుతుంది. అవసరమైతే యూఎస్‌ఏ లేదా యూఏకి పంపిస్తాం. బీసీసీఐ స్పోర్ట్స్ డాక్టర్, అథోపెడిక్ దిన్షా పర్నావాలా పర్యవేక్షణలో రిషబ్ పంత్‌కి ట్రీట్‌మెంట్ జరుగుతోంది... ’ అంటూ ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్స్ క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ శ్యామ్ శర్మ...

డిసెంబర్ 30న ఢిల్లీలోని రూకీ ఏరియాలో కారు ప్రమాదానికి గురయ్యాడు రిషబ్ పంత్. వెంటనే అతన్ని పక్కనే ఉన్న సాక్ష్యం ఆసుపత్రిలో చేర్చారు. తాత్కాలిక చికిత్స తర్వాత రిషబ్ పంత్‌ని మెరుగైన చికిత్స కోసం డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రికి మార్చారు...

నాలుగు రోజులుగా మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న రిషబ్ పంత్‌ని ముంబైకి పంపిస్తున్నట్టు ప్రకటించాడు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ శ్యామ్ శర్మ.. కారు ప్రమాదంలో రిషబ్ పంత్‌ నుదుటిన రెండు కాట్లు పడ్డాయి. అలాగే కుడి మోకాలికి తీవ్ర గాయమైంది.. కుడి మోచేతికి, పాదానికి, బొటనవేలికి కూడా గాయాలైనట్టు స్టేట్‌మెంట్‌లో రాసుకొచ్చింది బీసీసీఐ...

ముఖ్యంగా మోకాలి ఎముకకు అయిన గాయం చాలా తీవ్రమైనదని, దాని నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు వైద్యులు. ఈ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి కనీసం ఆరు నెలల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని సమాచారం...

ఇదే నిజమైతే ఐపీఎల్ 2023 సీజన్‌తో పాటు వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌కి, ఆ తర్వాత జూన్- జూలై మాసాల్లో జరిగే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్‌కి దూరం అవుతాడు రిషబ్ పంత్. ఆరు నెలల తర్వాత గాయం నుంచి కోలుకుని, పూర్తిగా ఫిట్‌నెస్ సాధించడానికి సమయం తీసుకుంటే అక్టోబర్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి కూడా రిషబ్ పంత్ అందుబాటులో ఉండడం అనుమానమే...
 

వన్డే, టీ20ల్లో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, కెఎల్ రాహుల్ రూపంలో వికెట్ కీపింగ్ బ్యాటర్లు అందుబాటులో ఉన్నా టెస్టు సిరీస్‌లో రిషబ్ పంత్ ప్లేస్‌ని భర్తీ చేసే ప్లేయర్‌ని వెతికి పట్టుకోవడం టీమిండియాకి చాలా కష్టమైన పని. బోర్డర్ గవాస్కర్ 2020-21 ట్రోఫీ నుంచి టీమిండియాకి టెస్టుల్లో కీ ప్లేయర్‌గా మారిన రిషబ్ పంత్, గబ్బా టెస్టుతో పాటు ఎన్నో మ్యాచుల్లో అద్భుత విజయాలు అందించాడు.. 

Follow Us:
Download App:
  • android
  • ios