న్యూఢిల్లీ: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కొన్ని సూచనలు చేశాడు. రిషబ్ పంత్ మరింత నిలకడైన ప్రదర్శన చేయాలని ఆయన సూచించాడు. అప్పుడప్పుడు మాత్రమే కాకుండా సుదీర్ఘ ఇన్నింగ్సులు ఆడే విషయంపై పంత్ దృష్టి పెట్టాలని ఆయన అన్నాడు. సెలెక్టర్లు ఉంచిన విశ్వాసాన్ని పంత్ నిలబెట్టుకోవాలని అన్నాడు.

వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డేలో 71 పరుగులతో రాణించిన పంత్ వన్డే ఫార్మాట్ లో తన తొలి అర్థ సెంచరీని నమోదు చేసుకున్నడాు. ఎంఎస్ ధోనీ ఎంత నిలకడగా జట్టు అవసరాలకు తగినట్లు ఆడాడో అదే తరహాలో రాణించడానికి ప్రయత్నించాలని ఆయన పంత్ కు సలహా ఇచ్చాడు. 

Also Read: ధోనీ.. ధోనీ.. అంటూ ప్రేక్షకుల హేళన: ప్రతిస్పందించిన రిషబ్ పంత్

ప్రధానంగా 60 నుంచి 70 పరుగుల వ్యక్తిగత స్కోరును సెంచరీలుగా మలుచుకోవాలని, అన్ని ఫార్మాట్లలో మేనేజ్ మెంట్ తనను ఎందుకు ఎంపిక చేసిందో పంత్ అర్థం చేసుకోవాలని గంభీర్ అన్నాడు. విశ్వాసం ఉంచే పంత్ కు మేనేజ్ మెంట్ అవకాశాలు ఇస్తోందని ఆయన అన్నాడు. 

టెస్టు తుది జట్టులో పంత్ ను ఆడించనప్పటికీ రిజర్వ్ ప్లేయర్ గానైనా కొనసాగిస్తోందని, అందుకు ప్రధాన కారణం పంత్ పై నమ్మకమేనని, దాన్ని పంత్ కాపాడుకోవాలని, ఇక్కడ భారీ సెంచరీలు అవసరం లేదని, ఎక్కువ సమయం క్రీజులో ఉండడానికి ప్రయత్నించాలని ఆయన చెప్పాడు.