చెన్నై: వెస్టిండీస్ మీద చెన్నై ఎంఎ చిదంబరం స్టేడియంలో జరిగిన తొలి వన్డే మ్యాచులో భారత వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ ను ప్రేక్షకులు హేళన చేశారు. ధోనీ ధోనీ అంటూ కేకలు వేస్తూ పంత్ ను ఆట పట్టించే పనికి ఒడిగట్టారు. ఆదివారం జరిగిన ఆ మ్యాచులో రిషబ్ బంత్ ఫామ్ లోకి వచ్చి 71 పరుగులు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు.

మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రేక్షకుల కేకలపై రిషబ్ పంత్ ప్రతిస్పందించాడు. వారి కేకలను అతను సానుకూల వైఖరితో తీసుకున్నాడు. కొన్నిసార్లు ప్రేక్షకులు మనకు మద్దతు తెలియజేయడం ముఖ్యమవుతుందని, ఎంఎస్ ధోనీ నినాదాలతో తనను గ్రీట్ చేసినందుకు వారికి కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నాడు. 

అంతర్జాతీయ మ్యాచుల్లో ఎలా ఆడాలో తనకు ఇప్పటికి అర్థమైందని పంత్ అన్ాడు. అంతర్జాతీయ క్రికెట్ లో సహజమైన ఆట ఏదీ ఉండదని, ఎవరైనా పరిస్థితులకు తగినట్లు ఆడాలనే విషయం తనకు అర్థమైందని అన్నాడు. బ్యాటింగ్ లో విఫలమవుతున్న పంత్ తీవ్ర విమర్శలకు గురవుతున్న విషయం తెలిసిందే.

అంతర్జాతీయ క్రికెట్ లో ఔత్సాహిక క్రికెట్ లో మాదిరిగా సహజమై ఆట ఏదీ ఉండదనీ అంతర్జాతీయ స్థాయిలో పరిస్థితులకు తగినట్లు లేదా జట్టు కోరినట్లు ఆడాలనేది తనకు అర్థమైందని ఆయన అన్నాడు. జట్టు విజయం కోసం మంచి స్కోరు సాధించడానికి చేయగలిగిందంతా చేస్తానని, ఇప్పుడు తన దృష్టంతా దానిపైనే ఉందని ఆయన అన్నాడు. జనం తన గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోనని ఆయన అన్నాడు. 

వ్యక్తిగా, ఆటగాడిగా తాను ఆటపై దృష్టి పెట్టాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. జనం కొన్నిసార్లు మన గురించి మంచిగా చెప్పుకుంటారు, కొన్ని సార్లు మాట్లాడుకోరు, ఇప్పడు తన ఆలోచన క్రికెట్ పైనే ఉందని అన్నాడు. విమర్శలను తట్టుకుని ఎలా నిలబడుగలుగుతారని అడిగితే తనను తాను నమ్ముకుంటానని జవాబిచ్చాడు. 

ప్రతి వ్యక్తికి కూడా తనపై తనకు నమ్మకం ఉండాలని ఆయన అన్నాడు. చుట్టుపక్కలవాళ్లు ఏమనుకుంటున్నారనేది పట్టించుకోవాల్సిన అవసరం లేదని, కొన్నిసార్లు పరుగులు సాధించవచ్చు.. మరికొన్నిసార్లు సాధించకపోవచ్చు గానీ ప్రక్రియ ఎప్పుడూ ముఖ్యమేనని ఆయన అన్నాడు.