ఐదో వికెట్‌కి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పిన రిషబ్ పంత్ - హార్ధిక్ పాండ్యా... ఒకే వన్డేలో 4 వికెట్లు తీసి, 50+ స్కోరు బాది రికార్డు క్రియేట్ చేసిన హార్ధిక్ పాండ్యా... సెంచరీతో చెలరేగిన రిషబ్ పంత్...

ఇంగ్లాండ్‌ టూర్‌లో టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో గెలిచిన రోహిత్ సేన, మూడో వన్డేలో గెలిచి వన్డే సిరీస్‌ని కూడా 2-1 తేడాతో గెలిచి టూర్‌ని ముగించింది. టాపార్డర్ బ్యాటర్లు ఫెయిల్ అయినా హార్ధిక్ పాండ్యా ఆల్‌రౌండ్ షోతో పాటు రిషబ్ పంత్ అద్భుత సెంచరీతో చెలరేగి భారత జట్టుకి ఘన విజయాన్ని అందించారు. 

ఇంగ్లాండ్‌లో వన్డే సిరీస్‌ గెలిచిన మూడో భారత కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ. ఇంతకుముందు మహ్మద్ అజారుద్దీన్, ఎమ్మెస్ ధోనీ మాత్రమే ఈ ఫీట్ సాధించారు.


260 పరుగుల లక్ష్యఛేదనలో 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది భారత జట్టు. 3 బంతుల్లో 1 పరుగు చేసిన శిఖర్ ధావన్, రీస్ టాప్లీ బౌలింగ్‌లో జాసన్ రాయ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 13 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా. 17 బంతుల్లో 4 ఫోర్లతో 17 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ కూడా రీస్ టాప్లీ బౌలింగ్‌లోనే జో రూట్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

22 బంతుల్లో 3 ఫోర్లతో 17 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ కూడా టాప్లీ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. 8.1 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 38 పరుగులు మాత్రమే చేసింది భారత జట్టు... 5 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 15 పరుగులు మాత్రమే ఇచ్చిన రీస్ టాప్లీ 3 వికెట్లు తీసి భారత ‘టాప్’ లేపాడు... 

సూర్యకుమార్ యాదవ్ 28 బంతుల్లో ఓ ఫోర్‌తో 16 పరుగులు చేసి క్రెగ్ ఓవర్టన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. ఈ దశలో హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్ కలిసి ఐదో వికెట్‌కి 133 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాని ఆదుకున్నారు...

55 బంతుల్లో 10 ఫోర్లతో 71 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా అవుట్ అయ్యాడు. విదేశాల్లో ఒకే వన్డే మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసి, హాఫ్ సెంచరీ చేసిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు హార్ధిక్ పాండ్యా... 

ఇంతకుముందు శ్రీకాంత్, సచిన్, గంగూలీ (రెండు సార్లు), యువరాజ్ సింగ్ (2 సార్లు) వంటి లెజెండరీ క్రికెటర్లు ఈ ఫీట్ సాధించినా అందరూ స్వదేశంలోనే నాలుగు వికెట్లు తీసి, 50+ స్కోర్లు నమోదు చేశారు. 

106 బంతుల్లో సెంచరీ మార్కు అందుకున్న రిషబ్ పంత్, ఇంగ్లాండ్‌లో వన్డే సెంచరీ బాదిన మొట్టమొదటి భారత వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా విదేశాల్లో వన్డే సెంచరీ చేసిన మూడో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్. ఇంతకుముందు రాహుల్ ద్రావిడ్ శ్రీలంకలో, కెఎల్ రాహుల్ 2020లో వికెట్ కీపర్‌గా న్యూజిలాండ్‌లో సెంచరీ చేశారు. 

సెంచరీ తర్వాత డేవిడ్ విల్లే వేసిన ఓవర్‌లో వరుసగా ఐదు ఫోర్లు బాదిన రిషబ్ పంత్, ఆఖరి బంతికి సింగిల్ తీసి 21 పరుగులు రాబట్టాడు. జో రూట్ బౌలింగ్‌లో ఫోర్ బాది మ్యాచ్‌ని ముగించాడు. 113 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 125 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు రిషబ్ పంత్...

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు, 45.5 ఓవర్లలో 259 పరుగులకి ఆలౌట్ అయ్యింది. గాయపడిన జస్ప్రిత్ బుమ్రా స్థానంలో తుది జట్టులోకి వచ్చిన మహ్మద్ సిరాజ్... తన మొదటి ఓవర్‌లో ఇంగ్లాండ్ జట్టుకి ఊహించని షాక్ ఇచ్చాడు...

3 బంతులాడి పరుగులేమీ చేయలేకపోయిన జానీ బెయిర్‌స్టో, సిరాజ్ బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అదే ఓవర్‌ ఆఖరి బంతికి జో రూట్ కూడా డకౌట్ అయ్యాడు. 3 బంతులాడిన జో రూట్, సిరాజ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్. ఈ దశలో జాసన్ రాయ్, బెన్ స్టోక్స్ కలిసి మూడో వికెట్‌కి 54 పరుగుల భాగస్వామ్యం అందించారు. 31 బంతుల్లో 7 ఫోర్లతో 41 పరుగులు చేసిన జాసన్ రాయ్, హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

29 బంతుల్లో 4 ఫోర్లతో 27 పరుగులు చేసిన బెన్ స్టోక్స్ కూడా హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లోనే అతనికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 74 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్. ఈ దశలో మొయిన్ ఆలీ, జోస్ బట్లర్ కలిసి ఐదో వికెట్‌కి 75 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు..

44 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 పరుగులు చేసిన మొయిన్ ఆలీ, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 27 పరుగులు చేసిన లియామ్ లివింగ్‌స్టోన్, హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో జడేజా పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు...

ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో వైపు క్రీజులో కుదురుకుపోయి హాఫ్ సెంచరీ చేసిన జోస్ బట్లర్ 80 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 60 పరుగులు చేశాడు. లివింగ్‌స్టోన్‌ని అవుట్ చేసిన ఓవర్‌లోనే పాండ్యా బౌలింగ్‌లో జడేజాకే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు బట్లర్...

199 పరుగులకే 7 వికెట్లు కోల్పోయినా డేవిడ్ విల్లే, క్రెగ్ ఓవర్టన్ కలిసి 8వ వికెట్‌కి 48 పరుగులు జోడించారు. 15 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 18 పరుగులు చేసిన డేవిడ్ విల్లే, యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

33 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 32 పరుగులు చేసిన క్రెగ్ ఓవర్టన్, చాహాల్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.. ఆ తర్వాత రెండో బంతికి తోప్లేని చాహాల్ క్లీన్ బౌల్డ్ చేశాడు... 


భారత బౌలర్లలో యజ్వేంద్ర చాహాల్ 3 వికెట్లు తీయగా రవీంద్ర జడేజాకి ఓ వికెట్ తీశాడు. సిరాజ్ 2 వికెట్లు తీయగా నాలుగు వికెట్లు తీసిన హార్ధిక్ పాండ్యా, కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదు చేశాడు. 7 ఓవర్లలో 3 మెయిడిన్లతో 24 పరుగులు మాత్రమే ఇచ్చిన హార్ధిక్ పాండ్యా, వన్డేల్లో మొట్టమొదటి సారి 4 వికెట్లు తీశాడు...