Asianet News TeluguAsianet News Telugu

దూకుడుగా ఆడి, అవుటైన రిషబ్ పంత్... నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా...

45 బంతుల్లో 6 ఫోర్లు,2 సిక్సర్లతో 46 పరుగులు చేసి అవుటైన రిషబ్ పంత్... 112 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా.. 

Rishabh Pant goes after Impressive counter attack knock in India vs Bangladesh 1st Test
Author
First Published Dec 14, 2022, 12:57 PM IST

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్, 45 బంతుల్లో 6 ఫోర్లు,2 సిక్సర్లతో 46 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్ కొట్టిన రిషబ్ పంత్, ఆ తర్వాతి బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 112 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది భారత జట్టు..

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకి శుభారంభం దక్కలేదు. రోహిత్ శర్మ గాయం కారణంగా తప్పుకోవడంతో కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న కెఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్‌తో కలిసి ఓపెనింగ్ చేశాడు. ఇద్దరూ నెమ్మదిగా ఆడుతూ తొలి వికెట్‌కి 41 పరుగుల భాగస్వామ్యం జోడించారు...

40 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, తైజుల్ ఇస్లాం బౌలింగ్‌లో యాసిర్ ఆలీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే రెండో వికెట్ కోల్పోయింది టీమిండియా. 54 బంతుల్లో 3 ఫోర్లతో 22 పరుగులు చేసిన కెప్టెన్ కెఎల్ రాహుల్, ఖలీద్ అహ్మద్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...

ఆఖరి వన్డేలో సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ... 5 బంతులాడి 1 పరుగుకే అవుట్ అయ్యాడు. తైజుల్ ఇస్లాం బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు విరాట్. డీఆర్‌ఎస్ తీసుకున్నా ఉపయోగం లేకపోయింది. 48 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది టీమిండియా.  ఈ దశలో రిషబ్ పంత్ దూకుడుగా ఆడుతూ బంగ్లా బౌలర్లపై కౌంటర్ అటాక్ చేశాడు...

అంతర్జాతీయ క్రికెట్‌లో 4 వేల పరుగులు పూర్తి చేసుకున్న రిషబ్ పంత్, టెస్టుల్లో 50 సిక్సర్ల ఫీట్‌ని అందుకున్నాడు. రోహిత్ శర్మ 51 ఇన్నింగ్స్‌ల్లో 50 టెస్టు సిక్సర్లు బాదగా, రిషబ్ పంత్ 54 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు.

ఓవరాల్‌గా పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదీ 46 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించి టాప్‌లో ఉంటే రోహిత్ శర్మ, రిషబ్ పంత్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అయితే బంతుల వారీగా చూసుకుంటే మాత్రం రోహిత్ శర్మ కంటే తక్కువ బంతుల్లో 50 సిక్సర్లు బాదేశాడు రిషబ్ పంత్...

గత 7 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 89 సగటుతో పరుగులు చేశాడు రిషబ్ పంత్. సౌతాఫ్రికా టూర్‌లో 100 చేసి నాటౌట్‌గా నిలిచిన రిషబ్ పంత్, ఆ తర్వాత 96, 39, 50, 146, 57, 46 పరుగులు చేసి మొత్తంగా 534 పరుగులు రాబట్టాడు..

16 పరుగుల వద్ద ఎబదత్ హుస్సేన్ బౌలింగ్‌లో ఛతేశ్వర్ పూజారా ఇచ్చిన క్యాచ్‌ని నురుల్ హసన్ జారవిడిచాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios