టీమిండియా ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్... కోలుకుంటున్న రిషబ్ పంత్! ఇన్నాళ్లకు కూర్చోగలిగానంటూ...
ఆరు బయట కూర్చొని, స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం కూడా వరమేనంటూ రిషబ్ పంత్ పోస్ట్... ప్రధాన వికెట్ కీపర్ లేకుండా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడేందుకు సిద్ధమవుతున్న టీమిండియా...

టీమిండియా ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమిండియా యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. గత ఏడాది డిసెంబర్ 30న ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్నాడు రిషబ్ పంత్. ఈ ప్రమాదంలో రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు మంటల్లో పూర్తిగా కాలి బూడిదైంది...
తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్, రెండు వారాలకు పైగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుని డిశార్జ్ అయ్యాడు. ప్రస్తుతం తన ఇంట్లో తల్లి సమక్షంలో ఉంటున్న రిషబ్ పంత్, ఇన్‌స్టాలో తన హెల్త్ అప్‌డేట్ ఇచ్చాడు...
‘బయట కూర్చొని, స్వచ్ఛమైన గాలి ఆస్వాదించడం కూడా ఓ గొప్ప వరంలా ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు...’ అంటూ కాప్షన్ జోడించాడు రిషబ్ పంత్..
ముంబైలోని కోకిలబెన్ ధీరుబాయ్ అంబానీ ఆసుపత్రిలో రిషబ్ పంత్‌కి మూడు సర్జరీలు నిర్వరించారు. నుదిటి భాగంలో ప్లాస్టిక్ సర్జరీతో పాటు మోకాళ్లకు రెండు శస్త్ర చికిత్సలు ముగిశాయి. మరో ఆరు వారాల తర్వాత రిషబ్ పంత్‌కి ఇంకో సర్జరీ చేయాల్సి ఉందని సమాచారం.
రిషబ్ పంత్ పూర్తిగా కోలుకుని, క్రికెట్ ఆడేందుకు కనీసం 6 నుంచి 9 నెలల వరకూ సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు వైద్యులు. గత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాలో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు రిషబ్ పంత్...
ఆడిలైడ్ టెస్టులో వృద్దిమాన్ సాహా అట్టర్ ఫ్లాప్ కావడంతో ప్రాక్టీస్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన రిషబ్ పంత్‌కి మెల్‌బోర్న్ టెస్టులో అవకాశం ఇచ్చింది టీమిండియా. మెల్‌బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 29 పరుగులు చేసి మెప్పించిన రిషబ్ పంత్, సిడ్నీలో జరిగిన మూడో టెస్టులో మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు...
తొలి ఇన్నింగ్స్‌లో 36 పరుగులు చేసిన రిషబ్ పంత్, డ్రాగా ముగిసిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 118 బంతుల్లో 12 ఫోర్లు,3 సిక్సర్లతో 97 పరుగులు చేసి సెంచరీకి 3 పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు...
బ్రిస్బేన్ టెస్టులో కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు రిషబ్ పంత్. తొలి ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేసి అవుటైన రిషబ్ పంత్, రెండో ఇన్నింగ్స్‌లో 138 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 89 పరుగులు చేసి... గబ్బాలో ఆస్ట్రేలియాకి 32 ఏళ్ల తర్వాత తొలి ఓటమిని రుచి చూపించాడు...
ఈ ఇన్నింగ్స్ తర్వాత టీమిండియాకి మూడు ఫార్మాట్లలోనూ ప్రధాన వికెట్ కీపర్‌గా మారిన రిషబ్ పంత్, గత ఏడాది సౌతాఫ్రికా టూర్‌లో సెంచరీతో అదరగొట్టాడు. బంగ్లాదేశ్ టూర్‌లో మంచి పర్ఫామెన్స్ ఇచ్చి మెప్పించాడు...
టెస్టుల్లో టీమిండియాకి కీ ప్లేయర్‌గా మారిన రిషబ్ పంత్ లేకపోవడం, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భారత్‌పై తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ... ఆఖరికి ఛతేశ్వర్ పూజారాని రిప్లేస్ చేసే ప్లేయర్లు, టీమిండియాకి అందుబాటులో ఉన్నా... ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలింగ్ యూనిట్‌ని రిషబ్ పంత్‌లా ఫేస్ చేయగల వికెట్ కీపింగ్ బ్యాటర్ ఇప్పట్లో టీమిండియాకి దొరకడం కష్టమే..
రిషబ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడడంతో ఇషాన్ కిషన్, కెఎస్ భరత్‌లను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేశారు సెలక్టర్లు. వీరిలో కొన్ని నెలలుగా టీమ్‌లో ప్లేస్ కోసం ఎదురుచూస్తున్న తెలుగు కుర్రాడు కోన శ్రీకర్ భరత్ కంటే వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన ఇషాన్ కిషన్‌కి తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్ వినబడుతోంది..