టీ20 వరల్డ్ కప్ 2022 ప్రోమోని విడుదల చేసిన ఐసీసీ... స్పెషల్ అట్రాక్షన్‌గా రిషబ్ పంత్... అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం కానున్న పొట్టి ప్రపంచకప్..

క్రికెట్‌లో క్రేజ్, పాపులారిటీ విషయంలో విరాట్ కోహ్లీకి ఎదురే లేదు. సెంచరీలు చేయలేకపోతున్నా, పరుగులు రాకపోయినా సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. విదేశాల్లో కూడా విరాట్ కోహ్లీకి బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది...

ఐసీసీ వరల్డ్ కప్ ప్రోమోల్లోనూ విరాట్ కోహ్లీయే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచేవాడు. 2019 వన్డే వరల్డ్ కప్‌తో పాటు 2021 టీ20 వరల్డ్ కప్‌లోనూ కోహ్లీ చుట్టూనే ప్రోమోలు డిజైన్ చేసింది ఐసీసీ. అయితే ఇప్పుడు సీన్ మారింది. కోహ్లీ బ్యాటు నుంచి పరుగులు రాకపోగా మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ కోల్పోయాడు...

Scroll to load tweet…

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఫెయిల్ అయితే, వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌లో విరాట్ కోహ్లీకి చోటు ఉంటుందో లేదో కూడా చెప్పడం కష్టమే. అసలు విరాట్ కోహ్లీ టీ20 వరల్డ్ కప్ 2022 ఆడతాడా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఐసీసీ కూడా రూట్ మార్చింది...

విరాట్ కోహ్లీకి బదులుగా భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ని లీడ్‌గా చూపిస్తూ టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ప్రోమోని విడుదల చేసింది అంతర్జాతీయ క్రికెట్ మండలి... సిడ్నీ నగరం నడిఒడ్డున సంద్రంలో నుంచి రిషబ్ పంత్, ‘బిగ్ స్టార్’గా బయటికి వస్తున్నట్టు ప్రోమోను వదిలింది...

రిషబ్ పంత్ తర్వాత విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్, పాక్ క్రికెటర్ ఇమామ్ వుల్ హక్, విండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రే రస్సెల్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ స్టోయినిస్, పాక్ బౌలర్ షాహిదీ ఆఫ్రిదీ... వంటి ప్లేయర్ల టీ20 మూమెంట్స్‌తో ప్రోమోని నింపేసింది... ఇందులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కనిపించకపోవడం విశేషం...

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో బ్యాటర్‌గా విఫలమైన రిషబ్ పంత్‌కి టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు అవసరం లేదని సూచించారు మాజీ క్రికెటర్లు. ఫామ్‌లో లేని రిషబ్ పంత్ కంటే ఫామ్‌లో ఉన్న సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్, యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌లను ఆడిస్తే బెటర్ అంటూ సూచించారు. అయితే ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో రిషబ్ పంత్‌ని ఓపెనర్‌గా పంపిస్తూ భారత జట్టు తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాన్ని ఇచ్చింది...

లోయర్ ఆర్డర్‌లో ఫినిషర్‌గా ఫెయిల్ అవుతూ వచ్చిన రిషబ్ పంత్, రోహిత్ శర్మతో కలిసి భారత జట్టుకి మెరుపు ఆరంభం అందించారు. దీంతో కెఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకునేదాకా పంత్‌ని ఓపెనర్‌గా వాడుకోవాలని చూస్తోంది టీమిండియా..

అక్టోబర్ 16న శ్రీలంక, నమీబియా మధ్య జరిగే మ్యాచ్‌తో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ మొదలుకానుంది. ఇప్పటికే పొట్టి ప్రపంచకప్‌కి 100 కౌంట్‌డౌన్ టూర్ మొదలైపోయింది. ఆతిథ్య ఆస్ట్రేలియాతో మొదలెట్టి, ఈ టోర్నీలో పాల్గొనే దేశాలన్నింటికీ వరల్డ్ కప్ ట్రోఫీని ఊరేగిస్తారు. చివరిగా డిఫెండింగ్ ఛాంపియన్, ఆతిథ్య ఆస్ట్రేలియాకి చేరుకుంటుంది పొట్టి ప్రపంచకప్ ట్రోఫీ...