టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ కి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్  డీన్ జోన్స్ మద్దతుగా నిలిచాడు. పంత్ చిన్నపిల్లాడని ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడని ఆయన చెప్పారు. ప్రస్తుతం టీమిండియా బంగ్లాదేశ్ తో తలపడుతున్న సంగతి తెలిసిందే. గత ఆదివారం తొలి టీ20 మ్యాచ్ జరగగా... అందులో ఇండియన్ క్రికెటర్లు సత్తా చాటలేక పోయారు. మరీ ముఖ్యంగా పంత్ పేలవ ప్రదర్శన అందరినీ నిరాశకు గురిచేసింది.

ప్రస్తుతం సెలక్టర్లు మాజీ కెప్టెన్ ధోనీని  పక్కన పెట్టేశారు. ధోనీ స్థానంలో వికెట్ కీపర్ గా పంత్ ని  ఎంపిక చేశారు. అయితే.. మొన్నటి మ్యాచ్ లో బ్యాటింగ్ లోనూ, వికెట్ కీపింగ్ లోనూ పంత్ తన సత్తా చాటలేకపోయాడు. డీఆర్ఎస్ రివ్యూ విషయంలో కూడా బోల్తా పడ్డాడు. ఈ కారణాలన్నీ జట్టు ఓటమికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో పంత్ పై విమర్శలు ఎక్కువయ్యాయి. నెటిజన్లు కూడా పంత్ ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ కి ఆసిస్ మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ మద్దతుగా నిలిచాడు. ‘‘ పంత్ ఇంకా చిన్న పిల్లాడు. ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడు. ఏమి జరుగుతోందో ఇప్పటికీ పంత్ కి తెలీదు. స్ట్రోక్ ప్లే విషయంలో పంత్ ఇంకా ఎక్కువగా కసరత్తు చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి అతను ఓ వన్ ట్రిక్ పోనీ( ఏదో ఒక్క టాలెంట్ మాత్రమే ప్రదర్శగలవాడు)’’ అంటూ డీన్ జోన్స్ పేర్కొన్నాడు.

‘‘ పంత్ ఇంకా ఎక్కువ కష్టపడాల్సి ఉంది. అతని ఆట తీరులో మార్పు రావడానికి మరీ ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. కానీ.. శిక్షణా కార్యక్రమంలో మాత్రం చాలా నిర్దిష్టంగా ఉండాలి. అప్పుడు కచ్చితంగా పంత్ మెరుగుపడతాడు’’ అని  ఆయన అన్నారు. 

మొన్న జరిగిన భారత్ తో జరిగిన  టీ20 మ్యాచ్ లో డీకాక్ కూడా తన ఆటను మార్చుకున్నాడు. ఈ విషయంలో ఆ టీ20లో స్పష్టంగా అర్థమౌతుంది. ఆస్ట్రేలియా తరపున డీకాక్ 52 టెస్టు మ్యాచ్ లు, 164ల అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లు ఆడారని గుర్తు చేశారు. పంత్ ఇంకా చిన్నవాడు కాబట్టి అతను కూడా కచ్చితంగా ఆటలో మెరుగౌతాడని ఆయన చెబుతున్నారు.