Rishabh Pant: టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ తన సోషల్ మీడియా ఖాతాలలో బయోను ఛేంజ్ చేశాడు. కొత్త డేట్ ఆఫ్ బర్త్ ను ప్రకటించాడు.
గతేడాది డిసెంబర్ 31న రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇప్పుడిప్పుడే రికవరీ అవుతున్న టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్.. తన ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ ఖాతాలలో బయో ను మార్చాడు. ఘోర రోడ్డు ప్రమాదం తర్వాత అతడు మళ్లీ పుట్టానంటూ తనకు పునర్జన్మ కలిగిందంటూ చెప్పకనే చెప్పాడు.
ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో డేట్ ఆఫ్ బర్త్ దగ్గర.. 05-జనవరి-2023గా పెడుతూ దానిని ‘సెకండ్ డేట్ ఆఫ్ బర్త్’ గా రాసుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పంత్ ఒరిజినల్ బర్త్ డే అక్టోబర్ 04, 1997. ఉత్తరాఖండ్ లోని రూర్కీ అతడి సొంత ఊరు. భారత్ తరఫున అండర్ - 19 వరల్డ్ కప్ లో కూడా ఆడిన పంత్.. ధోని తర్వాత అతడి వారసుడిగా ఆనతికాలంలోనే జట్టులో నిలదొక్కుకున్నాడు.
అయితే పంత్ తన డేట్ ఆఫ్ బర్త్ ను మార్చడం వెనుక పెద్ద రీజనే ఉంది. గతేడాది డిసెంబర్ 31న పంత్.. ఢిల్లీ నుంచి రూర్కీకి వచ్చే క్రమంలో మార్గమధ్యంలో కారు అదుపుతప్పడంతో తీవ్ర ప్రమాదానికి గురయ్యాడు. అటుగా వెళ్తున్న ఓ బస్ డ్రైవర్, కండక్టర్ తో పాటు స్థానికులు అతడిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు.
సుమారు నాలుగు రోజులు ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో చికిత్స పొందిన పంత్.. పలు సర్జరీల తర్వాత కోలుకున్నాడు. నాలుగు రోజులు కోమాలోనే ఉన్న అతడు.. జనవరి 5న కోలుకుని కుటుంబసభ్యులతో మాట్లాడాడు. అందుకే ఈ తేదీని సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ అని రాసుకున్నాడు. కాగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) లో రీహాబిటేషన్ పొందుతున్న పంత్.. చేతికర్ర సాయం లేకుండానే నడవగలుగుతున్నాడు. అక్టోబర్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ వరకైనా సిద్ధమవ్వాలని పంత్ భావిస్తున్నాడు. కానీ ప్రస్తుతం అతడు ఉన్న పరిస్థితిని చూస్తే ఆ లోపు అతడు పూర్తి స్థాయిలో రికవరీ అయ్యేది అనుమానంగానే ఉంది.
