ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, కోచ్, కామెంటేటర్ డీన్ జోన్స్ ఆకస్మిక మరణంతో క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది. కరోనా వైరస్ లాంటి ఎన్నో విపత్కర పరిస్థితులను దాటుకుని, ఐపీఎల్ 2020 సీజన్‌ను విజయవంతంగా ప్రారంభించిన క్రికెటర్లు, డీన్ జోన్స్ మరణంతో చలించిపోయారు. 59 ఏళ్ల వయసులో అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయిన డీన్ జోన్స్‌ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. దూకుడైన బ్యాటింగ్‌తో చురుకైన ఫీల్డింగ్‌తో మైదానంలో కదిలిన డీన్ జోన్స్... తన క్రికెట్ వ్యాఖ్యనంతో ‘ప్రొఫెసర్’గా గుర్తింపు తెచ్చుకున్నారు.

ప్రస్తుతం ఐపీఎల్‌కి కూడా కామెంటేటర్‌గా వ్యవహారిస్తున్న డీన్ జోన్స్... గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడం క్రికెట్ ప్రపంచానికి తీరని లోటు. డీన్ జోన్స్ మృతిపై భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రీతో పాటు మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, శిఖర్ ధావన్... తదితరులు ట్వీట్టర్ ద్వారా స్పందించారు.