ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్‌లో రింకూ సింగ్ సిక్సర్ల మోత... ఆఖరి ఓవర్‌లో వరుసగా హ్యాట్రిక్ సిక్సర్లతో మ్యాచ్‌ని ఫినిష్ చేసిన యంగ్ ఫినిషర్.. 

రింకూ సింగ్ కెరీర్‌ని రెండు భాగాలుగా విడదీయాల్సి వస్తే, ఐపీఎల్ 2023 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌కి ముందు, మ్యాచ్ తర్వాత అని చెప్పుకోవాల్సి వస్తుందేమో. అంతకుముందు నాలుగేళ్లుగా ఐపీఎల్ ఆడుతున్నా రింకూ సింగ్‌ని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు..

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో కేకేఆర్ విజయానికి 29 పరుగులు కావాల్సిన సమయంలో రింకూ.. వరుసగా 5 సిక్సర్లు బాది, అద్వితీయ ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరి ఓవర్ వరకూ మ్యాచ్ గెలిచేసినట్టుగా కూల్‌గా ఉన్న గుజరాత్ టైటాన్స్ టీమ్, రింకూ సింగ్ సిక్సర్ల సునామీ దెబ్బకు షాక్ అవ్వాల్సి వచ్చింది...

రింకూ సింగ్ బాదుడికి బౌలర్ యశ్ దయాల్ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి, తీవ్ర అనారోగ్యానికి గురై నెల రోజుల పాటు ఐపీఎల్ మ్యాచులు ఆడలేకపోయాడు. టీమిండియా ఆడిన మొదటి ఇన్నింగ్స్‌లో ఆఖరి 5 బంతుల్లో 4, 6,6, 1, 6 బాదిన రింకూ సింగ్, యూపీ టీ20 లీగ్‌లోనూ మరోసారి తన ఫినిషింగ్ టచ్‌ స్కిల్స్ చూపించాడు..

ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్‌లో కాశీ రుద్రాస్‌, మీరట్ మావ్‌రిక్స్‌ మధ్య జరిగిన మ్యాచ్ టైగా ముగిసి, సూపర్ ఓవర్‌‌లో ఫలితం తేలింది. మీరట్ మావ్‌రిక్స్‌ విజయానికి సూపర్ ఓవర్‌లో 17 పరుగులు కావాల్సి ఉండగా వరుసగా 3 సిక్సర్లు బాదిన రింకూ సింగ్, 4 బంతుల్లోనే మ్యాచ్‌ని ముగించేశాడు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కాశీ రుద్రాస్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. టీమిండియా ఆల్‌రౌండర్ కరణ్ శర్మ 44 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 పరుగులు చేశాడు. శివమ్ బన్సల్ 41 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేయగా ప్రిన్స్ యాదవ్ 12, అంకుర్ మాలిక్ 28, మహ్మద్ షరీమ్ 16 పరుగులు చేశారు.

ఈ లక్ష్యఛేదనలో పూర్తిగా 20 ఓవర్లు బ్యాటింగ్ చేసిన మీరట్ మావ్‌రిక్స్‌, 4 వికెట్లు కోల్పోయి సరిగ్గా 181 పరుగులు చేసింది. షోయబ్ సిద్ధికీ 24, స్వస్తిక్ చికారా 8, రింకూ సింగ్ 15, ఊర్వెశ్ అహ్మద్ 17, దివ్యాంశ్ జోషి 17 పరుగులు చేశారు. మాధవ్ కౌషిక్ 52 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 87 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశారు..

Scroll to load tweet…

మ్యాచ్ టైగా ముగియడంతో సూపర్ ఓవర్‌‌కి వెళ్లింది. సూపర్ ఓవర్‌లో ఓ ఫోర్, ఓ సిక్సర్ బాదిన కరణ్ శర్మ అవుట్ కాగా మహ్మద్ షరీం ఓ సిక్సర్ బాదాడు. దీంతో వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింద కాశీ రుద్రాస్. 17 పరుగుల లక్ష్యాన్ని ఓ 2, మూడు సిక్సర్లతో ముగించేశాడు రింకూ సింగ్..