INDW vs AUSW: కామన్వెల్త్ గేమ్స్  లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ లో ఇండియా-ఆస్ట్రేలియా మధ్య  జరుగుతున్న టీ20లో భారత జట్టు కంగారూలను రఫ్ఫాడిస్తున్నది. రేణుకా సింగ్ ఠాకూర్ నిప్పులు చెరిగింది.

కామన్వెల్త్ గేమ్స్‌ 2022లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టీ20లో బ్యాటింగ్ లో అదరగొట్టిన టీమిండియా బౌలింగ్ లో కూడా కంగారూలకు చుక్కలు చూపిస్తున్నది. 155 పరుగుల లక్ష్య ఛేదనలో ఆ జట్టు 12 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది. గ్రేస్ హరిస్ (33 నాటౌట్), గార్డ్‌నర్ (10) ఆడుతున్నారు. రేణుకాసింగ్ ఠాకూర్ కంగారూలకు కంగారు పుట్టించింది. తొలి ఓవర్ నుంచే ఆ జట్టుకు ముచ్చెమటలు పట్టించింది. నాలుగు ఓవర్లు వేసి 18 పరుగులే ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లను పడగొట్టింది.

155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన ఆసీస్.. రెండో బంతికే తొలి వికెట్ కోల్పోయింది. తన తొలి ఓవర్లో రేణుకా.. హీలీ (0) ని ఔట్ చేసి ఆసీస్ కు తొలి షాక్ ఇచ్చింది. రెండో ఓవర్లో మేఘనా సింగ్ 13 పరగులిచ్చింది. 

ఇక తన రెండో ఓవర్లో రేణుకా.. తొలి బంతికి వన్ డౌన్ లో వచ్చిన కెప్టెన్ మెగ్ లానింగ్ (8) ను ఔట్ చేసింది. లానింగ్.. రాధా యాదవ్ కు క్యాచ్ ఇచ్చింది. అదే ఓవర్లో ఐదో బంతికి మూనీ (10) కూడా బౌల్డ్ అయింది.

కాగా వరుసగా మూడు వికెట్లు కోల్పోవడంతో క్రీజులోకి వచ్చిన మెక్‌గ్రాత్ (14, 3 ఫోర్లు).. గైక్వాడ్ వేసిన నాలుగో ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి ధాటిగా ఆడేందుకు యత్నించింది. కానీ రేణుకా తర్వాతి ఓవర్లో ఆమె ఆటనూ కట్టించింది. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ తొలి బంతికి ఆమె.. మెక్‌గ్రాత్ ను బౌల్డ్ చేసింది. 

ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన దీప్తి శర్మ.. హేన్స్ (9) ను డగౌట్ కు పంపింది. దీంతో ఆసీస్ సగం వికెట్లు కోల్పోయింది. కానీ గార్డ్‌నర్, హరీస్ లు మళ్లీ ఆసీస్ ఇన్నింగ్స్ ను నిలబెట్టారు.