ఐపిఎల్ ఆనవాయితీ ప్రకారం గతేడాది విజేతగా నిలిచిన జట్టు యొక్క హోమ్ గ్రౌండ్‌లోనే ఫైనల్ మ్యాచ్ నిర్వహించాలి. ప్రతిసారి ఇదే పద్దతిలో ఐపిఎల్ షెడ్యూల్డ్ ను బిసిసిఐ రూపొందిస్తోంది. కానీ ఈసారి ఆ నియమాలను పక్కనబెడుతూ ముందుగా నిర్ణయించిన చెన్నైలో కాకుండా హైదరాబాద్ లో ఫైనల్ నిర్వహించనున్నారు. ఇందుకు బిసిసిఐ ప్రత్యేక చొరవ తీసుకోవడం అందరినీ ఆశ్యర్యానికి గురిచేసింది. అయితే బిసిసిఐ నిర్ణయం తీసుకోవడం వెనుక ఆర్థిక లావాదేవీలే ముఖ్య భూమిక పోషించినట్లు తెలుస్తోంది. 

ఐపిఎల్ నిబంధనల ప్రకారం లీగ్ దశలో మ్యాచ్ టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం మొత్తం ప్రాంచైజీలకే వెళుతుంది. కానీ ప్లేఆఫ్, ఫైనల్ మ్యాచుల ప్రవేశాల ద్వారా వచ్చే ఆదాయం మాత్రం బిసిసిఐకి లభిస్తుంది. ఇలా ప్లేఆఫ్, ఫైనల్ మ్యాచుల ద్వారా ఈసారి రూ.20 కోట్ల ఆదాయంసమకూరుతుందని బిసిసిఐ అంచనా వేసింది. అయితే ఆ అంచనాలపై చెన్నై నరపాలక సంస్థ  నిర్ణయం నీళ్లు చల్లింది. 

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో నిర్వహించతలపెట్టిన ఫైనల్ మ్యాచ్ లో ఐ, జే, కే స్టాండ్స్‌ తెరిచేందుకు చెన్నై నగర పాలక సంస్థ అధికారులు అంగీకరించలేదు.  దీంతో దాదాపు 12వేల సీట్లను ఖాళీగా వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల  బిసిసిఐకి భారీ నష్టం జరిగే  అవకాశం వుండటంతో ఫైనల్ ని హైదరాబాద్ కు తరలించినట్లు తెలుస్తోంది. 

గతేడాది ఫైనల్, ప్లేఆఫ్ ప్రవేశాల ద్వారా బిసిసిఐ కి రూ.18 కోట్ల ఆదాయం  వచ్చింది. ఈ ఆదాయాన్ని మరో రెండు కోట్లు పెంచి ఈసారి రూ.20 కోట్లు రాబట్టాలని బిసిసిఐ ముందుగానే లెక్కేసింది. అయితే చెన్నైలో ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తే అధిక ఆదాయం వచ్చే మాట అటుంచితే గతేడాది వచ్చినంత ఆదాయం కూడా వస్తుందో రాదోనని బిసిసిఐలో ఆందోళన మొదలయ్యింది. దీంతో వెంటనే మ్యాచ్ ను హైదరాబాద్ కు తరలిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

ఇక హైదరాబాద్ లో జరగాల్సిన క్వాలిఫైయర్-2, ఎలిమినేషన్ మ్యాచులు సెక్యూరిటీ కారణాల రిత్యా విశాఖపట్నానికి తరలిపోయాయి. మే 6, 10, 14తేదీల్లో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. దీంతో సెక్యూరిటీ కారణాల రిత్యా ఈ మ్యాచులను విశాఖకు తరలించారు. మే 8 ఎలిమినేటర్‌, మే 10న క్వాలిఫయర్‌ 2 విశాఖలో, క్వాలికఫయర్-1 మాత్రం చెన్నైలోనే జరగనుంది.