18 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది…. ఎట్టకేలకు విరాట్ కోహ్లీ ఐపిఎల్ కప్ ను ముద్దాడాడు. ఆర్సిబి విన్నింగ్ మూమెంట్స్ లో కోహ్లీ, అనుష్క దంపతులు చాలా ఎమోషనల్ అయ్యారు… కోహ్లీ అయితే మైదానంలోనే ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు.
IPL Final 2025: 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆర్సిబి ఐపీఎల్ కప్పును గెలుచుకుంది. ఫైనల్లో పంజాబ్ ను చిత్తుచేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన ఖాతాలో మొదటి ఐపిఎల్ కప్ వేసుకుంది. ఈ విజయం ఆర్సిబికి చాలా ప్రత్యేకమైనది… దాదాపు రెండు దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. ఈ మధుర క్షణాల్లో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కన్నీళ్లు పెట్టుకుంటూ మైదానంలో మోకరిల్లాడు.
ఎప్పుడూ ఉత్సాహంగా కనిపించే కోహ్లీ ఇలా కన్నీళ్లు పెట్టుకోవడం అరుదు. చివరి ఓవర్లో RCB కి 29 పరుగులు అవసరం… హెజిల్ వుడ్ వేసిన మొదటి రెండు బంతుల్లో శశాంక్ సింగ్ పరుగులు తీయలేకపోవడంతో పంజాబ్ గెలుపు దాదాపు అసాధ్యం అయిపోయింది. ఈ సపయంలో కెమెరాలు బౌండరీ లైన్ దగ్గర ఉన్న కోహ్లీ వైపు తిరిగాయి. ఈ విన్నింగ్ మూమెంట్ లో అతడు ఎమోషనల్ అయ్యాడు… మైదానంలోనే కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించాడు. చివరి బంతి వేసిన తర్వాత మైదానంలో మోకరిల్లి కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లీని సహచరులు ఓదార్చారు. గ్యాలరీలో ఉన్న అనుష్క శర్మ ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయింది.
18 ఏళ్ల నిరీక్షణతో పాటు, విమర్శలకు కూడా కోహ్లీ చెక్ పెట్టాడు. ఐపీఎల్లో రన్స్, చేజింగ్స్, బౌండరీలతో కోహ్లీ కింగ్ అయినా కప్ మాత్రం అందలేదు. ఎట్టకేలకు అది సాధ్యం అయ్యింది. ఆర్సిబి అభిమానులే కాదు ప్రత్యర్థి జట్టు అభిమానులు కూడా కోహ్లీ కప్పు గెలవాలని కోరుకున్నారు.
మొదటి సీజన్ నుంచి RCB తరపున ఆడిన ఏకైక ఆటగాడు కోహ్లీ. బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా జట్టును నడిపించిన దిగ్గజం. ఈ ఫైనల్లో కూడా అభిమానులను ఉర్రూతలూగించాడు. 36 ఏళ్ల వయసులో కూడా అత్యధిక పరుగులు చేసిన వారిలో కోహ్లీ ముందున్నాడు. ఈ సీజన్లో 656 పరుగులు చేశాడు.
ప్రతిసారి నిరాశ పరిచినా RCB అభిమానులకు కోహ్లీపై నమ్మకం ఉండేది. ఎట్టకేలకు కోహ్లీ తన అభిమానుల కోసం, RCB కోసం కప్పు గెలిచాడు. రెండు దశాబ్దాల నిరీక్షణకు తెరదించాడు. RCB కి ఇది తొలి కప్పు. ఇది కోహ్లీ కథ కూడా. కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనే సందేశం ఇచ్చాడు కోహ్లీ.
