IPL 2025 RCB vs CSK: చెన్నై సూపర్ కింగ్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఐపీఎల్ 2025 52వ మ్యాచ్‌లో రొమారియో షెపర్డ్ తుఫాన్ ఇన్నింగ్స్ తో పాటు ఆయూష్ మాత్రే అద‌రిపోయే బ్యాటింగ్ తో బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో ప‌రుగుల వ‌ర్షం వ‌చ్చింది. ఈ థ్రిల్లింగ్ మ్యాచ్ లో ఆర్సీబీ సూపర్ విక్ట‌రీ కొట్టింది.  

IPL 2025 RCB vs CSK: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ లో మ‌రో థ్రిల్లింగ్ మ్యాచ్ జ‌రిగింది. చివ‌రి వ‌ర‌కు ఉత్కంఠ‌గా సాగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉత్కంఠ‌భ‌రిత విజ‌యం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి ఓవర్ లో 15 పరుగులు అవసరం కాగా, 12 పరుగులు మాత్రమే చేసింది.

ఐపీఎల్ 2025 52వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవ‌ర్ల‌లో 213/5 ప‌రుగులు చేసింది. ఆర్సీబీకి మంచి ఆరంభం ల‌భించింది. మ‌ధ్య‌లో ఆర్సీబీ తడబడింది కానీ, చివ‌రి ఓవ‌ర్ల‌లో దుమ్మురేపింది. 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసిన ఆర్సీబీ.. రజత్ పాటిదార్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రొమారియో షెపర్డ్ దెబ్బ‌తో డ‌బుల్ సెంచ‌రీ ప‌రుగుల మార్కును దాటింది. షెప‌ర్డ్ వ‌రుస‌గా సిక్స్‌లు, ఫోర్లు బాది చిన్నస్వామిలో తుఫాను సృష్టించాడు.

రొమారియో షెపర్డ్ కేవ‌లం 14 బంతుల్లో 6 సిక్సర్లు, 4 ఫోర్లతో 53 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ను ఆడాడు. 19, 20వ ఓవర్లలో అత‌ను వ‌రుస‌గా సిక్స‌ర్ల మోత మోగించాడు. 378 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. అంత‌కుముందు, విరాట్ కోహ్లీ, బెథెల్ లు అద్భుత‌మైన ఆరంభం అందించారు. కోహ్లీ 5 పోర్లు, 5 సిక్స‌ర్ల‌తో 62 ప‌రుగుల ఇన్నింగ్స్ ఆడాడు. బెథెల్ 55 ప‌రుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు. దీంతో ఆర్సీబీ 20 ఓవ‌ర్ల‌లో 213-5 ప‌రుగులు చేసింది. 

భారీ టార్గెట్ తో రెండో ఇన్నింగ్స్ మొద‌లుపెట్టిన చెన్నై సూప‌ర్ కింగ్స్ కు యంగ్ ప్లేయ‌ర్లు ఆయూష్ మాత్రే, షేక్ ర‌షీద్ మంచి ఆరంభం అందించారు. ర‌షీద్ 14 ప‌రుగుల వ‌ద్ద అవుట్ అయ్యాడు. కానీ, మ‌రో ఎండ్ లో ఆయూష్ మాత్రే బ్యాటింగ్ తో దుమ్మురేపాడు. 25 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ పూర్తి చేశాడు. సెంచ‌రీ కొట్టేలా క‌నిపించాడు కానీ, 6 ప‌రుగుల దూరంలో సెంచ‌రీ మిస్ అయ్యాడు. 48 బంతుల్లో 94 ప‌రుగుల ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 5 సిక్స‌ర్లు బాదాడు. 

సామ్ క‌ర‌ణ్‌, బ్రెవిస్ నిరాశ‌ప‌రిచారు. సీనియ‌ర్ స్టార్ ఆల్ రౌండ‌ర్ ర‌వీంద్ర జడేజా అద్భుతంగా ఆడుతూ చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ ను విజ‌యం వైపు తీసుకెళ్లాడు కానీ, సక్సెక్ కాలేకపోయాడు. జడేజా 77 పరుగులు చేశాడు. చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 211 పరుగులు మాత్రమే చేసింది. రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది.