Asianet News TeluguAsianet News Telugu

IPL: ఆర్సీబీలోకి భారత్‌ను భయపెట్టిన ఆల్ రౌండర్.. జాక్స్ స్థానంలో అతడితో చర్చలు..

IPL 2023:మరో రెండు వారాల్లో   మొదలుకాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఈ సీజన్ నుంచి తప్పుకున్న విల్ జాక్స్ కు రిప్లేస్మెంట్ పై దృష్టిసారించింది.  

RCB Talks With Michael Bracewell After English Cricketer Will Jacks Rules Out MSV
Author
First Published Mar 17, 2023, 2:40 PM IST

గతేడాది ఐపీఎల్ మినీ వేలంలో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్  విల్ జాక్స్ ను  రూ. 3.2 కోట్లకు దక్కించుకున్న ఆర్సీబీ.. ఇటీవలే అతడు ఈ సీజన్ నుంచి తప్పుకోవడంతో  మరో కొత్త ఆల్ రౌండర్ వేట మొదలుపెట్టింది.  ఈ జాబితాలో న్యూజిలాండ్ యువ సంచలనం.. ఇటీవలే భారత పర్యటనకు వచ్చిన ఆ జట్టులో కీలక ఆటగాడిగా వ్యవహరించిన మైఖేల్ బ్రాస్‌వెల్ ను తీసుకోనున్నట్టు తెలుస్తున్నది. దీనిపై ఇదివరకే ఆర్సీబీ.. బ్రాస్‌వెల్ తో చర్చలు సాగించినట్టు తెలుస్తున్నది. 

ఈ కివీస్ ఆల్ రౌండర్.. న్యూజిలాండ్ తో హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో 78 బంతుల్లోనే 140 పరుగులతో వీరవిహారం చేశాడు. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా భారత బ్యాటర్లను ఇబ్బందిపెట్టాడు.  వన్డేలతో పాటు టీ20 సిరీస్ లో కూడా ఆ జట్టులో కీలక ఆటగాడిగా సేవలందించాడు.  

కాగా  విల్ జాక్స్ రిప్లేస్మెంట్ గా బ్రాస్‌వెల్ అయితేనే బెటర్ అని ఆర్సీబీ యాజమాన్యం భావిస్తున్నది.   గ్లెన్ మ్యాక్స్‌వెల్ సీజన్ లో ఏ మేరకు అందుబాటులో ఉంటాడనేది అనుమానంగానే ఉంది. గత నవంబర్ లో  కాలిగాయంతో అతడు సుమారు నాలుగు  నెలల పాటు క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం భారత్ - ఆస్ట్రేలియాల మధ్య  జరుగుతున్న  వన్డే సిరీస్ లో మ్యాక్సీ భాగమైనా ఐపీఎల్ లో అతడు ఏ మేరకు  రాణిస్తాడనేది ఇంకా స్పష్టత లేదు. దీంతో   ఆర్సీబీకి నిఖార్సైన ఆల్ రౌండర్ కొరత వేధిస్తున్నది. ఆ  స్థానాన్ని బ్రాస్‌వెల్ అయితే భర్తీ చేస్తాడని కోహ్లీ టీమ్ విశ్వసిస్తోంది. 

బ్రాస్‌వెల్ తో ఇదివరకే ఒప్పందం గురించిన చర్చలు ముగిశాయని.. అధికారిక ప్రకటనే మిగిలుందని  ఆర్సీబీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఆటగాళ్లు, స్టార్ ప్లేయర్లు,  కెప్టెన్లు మారుతున్నా ఆర్సీబీ ఇంతవరకూ ఈ  లీగ్ లో  ట్రోఫీని నెగ్గలేదు. మరి  ఈసారైనా కోహ్లీ జట్టు  ఆ కలను నెరవేర్చుకుంటుందా..? ఆ  క్రమంలో బ్రాస్‌వెల్ ఏ మేరకు సక్సెస్ అవుతాడనేది ఆసక్తికరంగా మారింది. 

 

ఇక  విల్ జాక్స్ విషయానికొస్తే.. ఇటీవలే బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టుతో  జాక్స్ కూడా ఉన్నాడు. అయితే రెండో వన్డే సందర్భంగా జాక్స్ ఎడమ తొడ కండరాలు పట్టేడయంతో అతడు మూడో వన్డే నుంచి తప్పుకున్నాడు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అతడిని హుటాహుటిన   లండన్ కు   రప్పించి వైద్య సాయం కూడా అందిస్తోంది. రెండ్రోజుల క్రితం  జాక్స్  ఐపీఎల్ లో ఆడతాడా..? లేదా..? అనే విషయమై  ఈసీబీ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. రాబోయే సీజన్ లో విల్ జాక్స్ ఆడటం కష్టమని తేల్చేశాడు.  ప్రస్తుతం అతడు వైద్యుల సంరక్షణలో చికిత్స పొందుతున్నాడని, కోలుకోవడానికి మరికొన్ని  వారాలు సమయం పట్టే అవకాశముందని  తేల్చేశాడు.  ఈ విషయాన్ని ఇదివరకే ఆర్సీబీకి  తేల్చి చెప్పినట్టు  వివరించాడు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios