WPL 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బుధవారం తొలి విజయాన్ని నమోదు చేసింది. యూపీ వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లో గెలిచి బోణీ కొట్టింది. మ్యాచ్ కు ముందు కోహ్లీ.. ఆర్సీబీ అమ్మాయిలతో ముచ్చటించాడు.
మహిళల ప్రీమియర్ లీగ్ లో వరుసగా ఐదు ఓటముల ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ స్మృతి మంధాన సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సీజన్ లో బోణీ కొట్టింది. ఈ మ్యాచ్ కు ముందు టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లీ మాట్లాడిన మాటలు.. ఆర్సీబీ అమ్మాయిలకు వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చాయి. ‘గెలుపోటముల సంగతి తర్వాత.. ముందైతే పోరాడండి..’అంటూ కోహ్లీ చెప్పిన మాటలు మంధాన అండ్ కో.కు టానిక్ లా పనిచేశాయి. అయితే కోహ్లీ స్పీచ్ ఆర్సీబీ అమ్మాయిలకు ఉత్తేజానివ్వగా.. ఫ్యాన్స్ కూడా ఆ జట్టు మెంటార్ గా నియమితురాలైన సానియా మీర్జాను నెట్టింట ఆటాడుకుంటున్నారు.
యూపీ వారియర్స్ తో మ్యాచ్ కు కొద్దిసేపు ముందు విరాట్ కోహ్లీ.. ఆర్సీబీ క్యాంప్ కు వెళ్లాడు. ఆస్ట్రేలియాతో రేపు (శుక్రవారం) జరుగబోయే తొలి వన్డే కు ముందు వాంఖెడేకు చేరుకున్న కోహ్లీ.. అక్కడే (డీవై పాటిల్)ఉన్న ఆర్సీబీ ఆటగాళ్లను కలిశాడు. వారిని ఓదార్చుతూనే ఆటగాళ్లలో స్ఫూర్తినిచ్చే విధంగా మాట్లాడాడు.
కోహ్లీ మాట్లాడుతూ.. ‘నేను 15 ఏండ్లుగా ఐపీఎల్ ఆడుతున్నాను. ఇప్పటిదాకా మేం ఐపీఎల్ లో ట్రోఫీ గెలవలేదు. అయినా కూడా అది నన్ను ఆపలేదు. ప్రతి ఏడాది ఉత్సాహంతో బరిలోకి దిగుతుంటా. ప్రతి మ్యాచ్, ప్రతి టోర్నీలో శాయశక్తులా శ్రమిస్తా. ఒకవేళ నేను గెలిచుంటే చాలా గ్రేట్. నేను కూడా సంతోషంగా ఉండేవాడిని. కానీ అలా జరుగలేదు. అయినా సరే అవకాశాల కోసం ఎదరుచూస్తూనే ఉంటా. ఇప్పటివరకూ ఒక్క ఐపీఎల్ ట్రోఫీ నెగ్గకున్నా మనకు ప్రపంచంలో ఏ జట్టుకూ లేని అభిమానగణం ఉన్నారు. ప్రపంచంలో అత్యుత్తమ అభిమానుల మద్దతు ఉన్న జట్టు ఏదైనా ఉందంటే అది మనదే అని నమ్ముతా. ప్లే ఆఫ్స్ కు వెళ్లేందుకు కూడా మీకు అవకాశాలు ఒక్క శాతం మాత్రమే ఉన్నాయి. కానీ ఆ ఛాన్స్ కూడా చాలా కీలకం. వాటిని మెరుగుపరుచుకోవాలి..’అని కోహ్లీ చెప్పాడు.
కోహ్లీ మాటలు ఆర్సీబీ అమ్మాయిల్లో స్పూర్తినింపాయి. గత ఐదు మ్యాచ్ లలో లేని విధంగా యూపీ వారియర్స్ తో బెంగళూరు టీమ్ అన్ని విభాగాల్లోనూ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది.
కాగా కోహ్లీ స్పీచ్ నెట్టింట వైరల్ కావడంతో ఆర్సీబీ అభిమానులు ఆ జట్టు మెంటార్ సానియా మీర్జాను ట్రోల్ చేస్తున్నారు. జట్టుకు మెంటార్ గా పనిచేయడమంటే డగౌట్ లో కూర్చుని ఇంటర్వ్యూలు ఇవ్వడం కాదని, జట్టులో స్ఫూర్తి నింపాలని కామెంట్స్ చేస్తున్నారు. టెన్నిస్ ఆడే వ్యక్తిని తీసుకొచ్చి క్రికెటర్లకు మెంటార్ గా నియమించడం ఆర్సీబీ చేసిన బుద్ది తక్కువ పని అని వాపోతున్నారు.
20 రోజులుగా మెంటార్ గా ఉండి సానియా మీర్జా టీమ్ కు ఒక్క విజయాన్ని కూడా అందివ్వలేకపోయిందని.. కోహ్లీ ఒక్క స్పీచ్ తో అదరగొట్టాడని కామెంట్స్ చేస్తున్నారు. ఆర్సీబీకి రియల్ మెంటార్ అంటే కోహ్లీనే అని.. టెన్నిస్ ప్లేయర్ కాదని ట్రోల్ చేస్తున్నారు.
