WPL 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) పెను సంచలనాలకు వేదికగా మారుతున్నది. ఇటీవలే  వేలం ముగిసిన ఈ లీగ్ లో జబర్దస్త్ టీమ్ ను దక్కించుకున్న  ఆర్సీబీ మరో సంచలనానికి తెరతీసింది. 

మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ కు త్వరలోనే తెరలేవనుంది. మార్చి 4 నుంచి ఈ లీగ్ ముంబై వేదికగా జరగాల్సి ఉంది. మూడు రోజుల క్రితమే ముగిసిన వేలం విజయవంతమైన నేపథ్యంలో ఈ లీగ్ ను కూడా అంతకంటే డబుల్ సక్సెస్ చేయాలనే పట్టుదలతో బీసీసీఐ ప్రణాళికలు రచిస్తున్నది. కాగా ఎవరి ఊహలకు అందకుండా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సరికొత్త సంప్రదాయానికి తెరతీసింది. ఆ జట్టు మెంటార్ గా భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జాను ఎంపికచేసింది. 

బుధవారం ట్విటర్ వేదికగా ఆర్సీబీ ఈ విషయాన్ని వెల్లడించింది. తమ మహిళల జట్టుకు మెంటార్ గా ఉండేందుకు ఇంతకంటే గొప్ప వ్యక్తి మరెవరూ ఉండరంటూ ఆమెకు ఘన స్వాగతం పలికింది. 

ఈ మేరకు ట్విటర్ లో సానియా మీర్జా ఆర్సీబీ జెర్సీతో ఉన్న షర్ట్ పోస్ట్ చేస్తూ.. ‘మా కోచింగ్ సిబ్బంది క్రికెట్ కు సంబంధించిన వివరాలను చూసుకుంటున్నది. అయితే కఠిన పరిస్థితులను అధిగమించేందుకు, మా మహిళా క్రికెటర్లకు మార్గదర్శిగా ఉండేందుకు గాను ఓ ఛాంపియన్ అథ్లెట్ ను ఎంపికచేశాం. తన కెరీర్ లో ఎన్నో అవరోధాలు అధిగమించి లెజెండ్ గా ఎదిగిన క్రీడాకారిణిని మా మెంటార్ గా నియమించాం. ఆమెను మా ఫ్యామిలీలోకి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం.. నమస్కార సానియా మీర్జా..’అని ట్వీట్ లో పేర్కొంది.

Scroll to load tweet…

ఫోటోతో పాటు ఆమెను టీమ్ లోకి ఆహ్వానిస్తూ ఓ వీడియోను కూడా ఆర్సీబీ విడుదల చేసింది. ఈ వీడియలో సానియాను మెంటార్ గా నియమించడానికి గల కారణాలను వివరించే యత్నం చేసింది. సానియా కూడా టెన్నిస్ నుంచి రిటైర్ అయిన తర్వాత మహిళా క్రీడాకారులకు తన వంతు సాయం చేయాలనే ఉద్దేశంతోనే మెంటార్ గా ఉండేందుకు ఒప్పుకున్నానని చెప్పుకొచ్చింది.

Scroll to load tweet…

సానియా ఇటీవలే ముగిసిన ఆస్ట్రేలియా ఓపెన్ లో మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో రన్నరప్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆమెకు ఇదే చివరి గ్రాండ్ స్లామ్ టోర్నీ. ఆస్ట్రేలియా ఓపెన్ తర్వాత ఆమె దుబాయ్ వేదికగా జరిగే దుబాయ్ ఓపెన్ లో ఆడి టెన్నిస్ నుంచి పూర్తిగా రిటైర్ కాబోతున్నది.

డబ్ల్యూపీఎల్ లో ఆర్సీబీ జట్టు : స్మృతి మంధాన, సోఫీ డివైన్, ఎలీస్ పెర్రీ, రేణుకా సింగ్ ఠాకూర్, రిచా ఘోష్, ఎరిన్ బర్న్స్, దిశా కసత్, ఇంద్రాణి రాయ్, శ్రేయాంక పాటిల్, ఆష్ శోభన, కనిక అహుజా, డేన్ వన్ నీకర్క్, పూనమ్ ఖేమ్నర్, అశ్విన్ కుమారి, ప్రీతి బోస్, హెథర్ నైట్, మేగన్ షూట్, సహనా పవార్