Asianet News TeluguAsianet News Telugu

రమీజ్ రాజా కంటే నువ్వే బెటర్ స్టోక్స్.. ఇంగ్లాండ్ సారథి నిర్ణయంపై ప్రశంసలు

PAKvsENG: పాకిస్తాన్ - ఇంగ్లాండ్ నడుమ రావల్పిండి వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో   ఇంగ్లీష్ సారథి బెన్ స్టోక్స్ తీసుకున్న  ఆశ్యర్యకర నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.  
 

Rawalpindi Audience Respected Ben Stokes More Than Ramiz Raja:  Netizens Praised England Skipper
Author
First Published Dec 5, 2022, 1:32 PM IST

సుమారు 17 ఏండ్ల తర్వాత  పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన  ఇంగ్లాండ్ తొలి టెస్టులో అదరగొడుతున్నది. రావల్పిండి వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో  ఇంగ్లాండ్ మొదటిరోజే  506 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.   ఆ తర్వాత పాకిస్తాన్ కూడా ధీటుగానే బదులిచ్చింది. అయితే నాలుగో రోజు  లంచ్ టైమ్ వరకు  పటిష్ట స్థానంలో  ఉన్న ఇంగ్లాండ్ ఈ టెస్టులో ఫలితం కోసం  తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 

రోజున్నర ఆట ఉన్న ఈ టెస్టులో  అదీ పాకిస్తాన్ తో స్వదేశంలో 343  పరుగుల లక్ష్యాన్ని నిలపడం సాహసమే. బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై  బౌలర్లకు పెద్దగా సహకారం అందకున్నా స్టోక్స్ నిర్ణయం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. దీనిపై సోషల్ మీడియాలో కూడా  నెటిజన్లు   స్టోక్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

ఇదే విషయమై ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘వావ్, ఇది గొప్ప నిర్ణయం.  టెస్టు క్రికెట్ ను ఇలా ఆడాలి.’ అని ట్వీట్ చేశాడు.  ఈ ట్వీట్ కు పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ‘టెస్టు క్రికెట్ ను బతికిస్తున్న దేశాలలో ఇంగ్లాండ్ కూడా ఒకటి.  బహుశా బెన్ స్టోక్స్ తీసుకున్న ఈ నిర్ణయంతో రావల్పిండితో పాటు పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు ఆ దేశ బోర్డు చైర్మెన్ రమీజ్ రాజా కంటే  స్టోక్స్ ను ఎక్కువగా గౌరవిస్తారు..’ అని కామెంట్ చేస్తున్నారు. 

‘స్టోక్స్ తీసుకున్న ఈ నిర్ణయం  చాలా ధైర్యంతో కూడుకున్నది.  బ్యాటింగ్ పిచ్ మీద ఇటువంటి డిసిషన్ తీసుకోవడం మాములు విషయం కాదు..’, ‘బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న పిచ్.. స్వింగ్ , సీమ్, పేస్ ఏ మాత్రం లేని రావల్పిండిలో  అదీ   పాక్ తో స్వదేశంలో  రోజున్నర ఆట మిగిలిఉన్నా  స్టోక్స్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రశంసనీయం. డ్రా కోసం చూడకుండా ఫలితమేదైనా  ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం   వల్ల టెస్టు క్రికెట్ బ్రతుకుతుంది. బెన్ స్టోక్స్,  బ్రెండన్ మెక్ కల్లమ్ లు ప్రేక్షకులను తిరిగి  స్టేడియాలకు రప్పిస్తున్నారు..’, ‘ఇంగ్లాండ్ టీమ్ ను చూసి  మిగతా జట్లు నేర్చుకోవాలి. స్టోక్స్, మెక్ కల్లమ్ లు కలిసి అద్భుతాలు చేస్తున్నారు..’ అని ప్రశంసలు కురిపిస్తున్నారు. 

 

 

 

జీవం లేని రావల్పిండి పిచ్ లో ఇప్పటికే తొలి టెస్టులో సుమారుగా 1500కు పైగా పరుగులు నమోదయ్యాయి.  బౌలర్లకు పీడకలలు, బ్యాటర్లు సంబురాలు చేసుకుంటున్న ఈ నిస్సార పిచ్ ను తయారుచేసినందుకు గాను పీసీబీపై పాక్ ఫ్యాన్స్ తో పాటు క్రికెట్ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విటర్ లో అయితే రమీజ్ రాజా పై  ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. 

 

Follow Us:
Download App:
  • android
  • ios