Asianet News TeluguAsianet News Telugu

విమర్శలకు చెక్ : అల్ రౌండర్ గా రవీంద్ర జడేజా ప్రతిభ ఇదీ...

ఛేదనలో మొనగాడు విరాట్‌ కోహ్లి పని పూర్తి చేయకుండానే నిష్క్రమించటం అరుదు. అటువంటి అరుదైన కటక్‌ ఛేదనలో జడేజా బాధ్యత తీసుకున్నాడు. తోడుగా టెయిలెండర్‌ షార్దుల్‌ ఠాకూర్‌. 23 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన దశలో యువ టెయిలెండర్‌ను తోడుగా మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే ఛేదన ముగించాడు జడేజా. 

ravindra jadeja turns out to be the perfect all rounder for team India
Author
Hyderabad, First Published Dec 24, 2019, 11:16 AM IST

ఫీల్డింగ్‌లో పాదరసంలా కదులుతాడు. చురుకైన కదలికలతో ఓటమి అంచున ఉన్న వేల సైతం అవకాశాలు సృష్టించగలడు. లెఫ్టార్మ్‌ స్పిన్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ దూకుడుకు ముకుతాడు వేయగలడు. 

వేగవంతంగా బంతులు వేస్తూ ఓవెన్లను త్వరగా పూర్తిచేస్తూ.. కెప్టెన్‌పై ఓవర్‌రేట్‌ భారాన్ని భారీగా తగ్గించగలడు. బ్యాట్‌తో స్పెషలిస్ట్‌లా మెరువగలడు, కానీ ఇక్కడే నిలకడ లోపించింది. 

రవీంద్ర జడేజాను పరిమిత ఓవర్ల ఫార్మాట్‌ జట్టుకు రెగ్యులర్‌ తుది జట్టు ఆటగాడిగా మారకుండా నిలువరించింది. 2019 ప్రపంచకప్‌ సెమీఫైనల్స్‌ ఇన్నింగ్స్‌ జడేజా ఆత్మవిశ్వాసం పెంచింది. ఇప్పుడు జడేజా భారత వన్డే, టీ20 జట్టులో ఒక పరిపూర్ణ ఆల్‌రౌండర్‌ అని చెప్పవచ్చు. 

విమర్శలకు కొదవలేదు... 

మాంచెస్టర్‌ వరల్డ్‌కప్‌ సెమీఫైనల్స్‌ తర్వాత కోహ్లిసేన కరీబియన్‌ దీవుల్లో పర్యటించింది. అక్కడ తిరుగులేని రికార్డులున్న ట్రంప్‌కార్డ్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను కాదని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రవీంద్ర జడేజాను తుది జట్టులోకి తీసుకున్నాడు. 

కోహ్లి తుది జట్టు కూర్పు నిర్ణయంపై దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ తీవ్ర విమర్శలు చేశాడు. తాజా ఫామ్‌ ఆధారంగా జడేజాకు కోహ్లి తొలి ప్రాధాన్య ఓటు వేసినా.. దీర్ఘకాలంలో జడేజాపై ఆ నమ్మకం ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. 

Also read: టాప్ లేపిన విరాట్ కోహ్లీ: ఈ దశాబ్దం సీఏ టెస్ట్ కెప్టెన్

ఈ నేపథ్యంలోనే వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు ఆరంభానికి ముందు ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి ఓ ప్రశ్న ఎదురైంది. మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌, యుజ్వెంద్ర చాహల్‌లను ఫింగర్‌ స్పిన్నర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌లను వేరు చేస్తున్న అంశం ఏమిటీ? అని ఓ పాత్రికేయుడు కోహ్లిని అడిగాడు. 

విభిన్న కారణాలను చెప్పే ప్రయత్నం చేసిన కోహ్లి.. పెద్ద గ్రౌండ్‌లలో మణికట్టు స్పిన్నర్ల ప్రాధాన్యత నొక్కి చెప్పాడు. జడేజా బ్యాటింగ్‌ నైపుణ్యం జట్టుకు లోతైన బ్యాటింగ్‌ లైనప్‌ బలం తీసుకొస్తున్న సమతూకాన్ని వివరించాడు. 

'జడేజా చాలా బాగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. జడేజా అతడి కెరీర్‌లో అత్యుత్తమ బ్యాటింగ్‌ ఫామ్‌లో ఉన్నాడని భావిస్తున్నాం. బంతితో జడేజా చక్కని ఫింగర్‌ స్పిన్నర్‌, కచ్చితమైన బౌలర్‌. ఫీల్డింగ్‌లో అతడి సామర్థ్యంపై అనుమానాలు అక్కర్లేదు. ఆల్‌రౌండర్‌గా జడేజాకు ఇది అత్యుత్తమ కాలం. దాన్ని జట్టు సద్వినియోగం చేసుకోవాలని భావిస్తుంది' అని విరాట్‌ కోహ్లి జడేజాపై విశ్వాసాన్ని వెలిబుచ్చాడు.

జడేజా కెరీర్ ను మలుపుతిప్పిన ఇన్నింగ్స్...

 2019 వన్డే వరల్డ్‌కప్‌ సెమీఫైనల్లో టీమ్‌ ఇండియా పరాజయం పాలైనా రవీంద్ర జడేజా ఇన్నింగ్స్‌ భారత్‌ను గెలుపు దారిలో నిలిపింది. ధోని అండగా జడేజా క్రీజులో ఉన్నంతసేపు మ్యాచ్‌పై భారత్‌కు ఆశలు మాత్రమే కాదు కచ్చితమైన నమ్మకం ఉన్నది. 

Also read: ఆ అరగంటనే వెరీ బ్యాడ్: విరాట్ కోహ్లీకి అంతా సంతోషమే

ఆ ఇన్నింగ్స్‌ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయినా, వ్యక్తిగతంగా జడేజాను ఉన్నత స్థానాలకు చేర్చింది. తాజాగా ఆదివారం వెస్టిండీస్‌తో కటక్‌లో జరిగిన వన్డేలో జడేజా 31 బంతుల్లో 39 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో టీమ్‌ ఇండియాకు మరో అద్భుత విజయాన్ని అందించాడు. 

ఛేదనలో మొనగాడు విరాట్‌ కోహ్లి పని పూర్తి చేయకుండానే నిష్క్రమించటం అరుదు. అటువంటి అరుదైన కటక్‌ ఛేదనలో జడేజా బాధ్యత తీసుకున్నాడు. తోడుగా టెయిలెండర్‌ షార్దుల్‌ ఠాకూర్‌. 23 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన దశలో యువ టెయిలెండర్‌ను తోడుగా మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే ఛేదన ముగించాడు జడేజా. 

కోహ్లి అప్పగించి వెళ్లిన ముగింపు బాధ్యతను జడేజా ప్రశాంతంగా పూర్తి చేశాడు. వెస్టిండీస్‌తో సిరీస్‌ ఆరంభానికి ముందు కెప్టెన్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.

అనుభవం తోడైన వేళ... 

316 పరుగుల ఛేదనలో భారత్‌ ప్రయాణం రెగ్యులర్‌గానే సాగింది. టాప్‌-3 బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ, లోకేశ్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లిలు అర్ధ సెంచరీలు సాధించారు. ఫామ్‌లో ఉన్న శ్రేయాస్ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌ సహా కేదార్‌ జాదవ్‌ విఫలమయ్యారు. 

దీంతో కెప్టెన్‌ కోహ్లితో జట్టుకట్టిన జడేజా సారథిపై ఒత్తిడి పడకుండా స్ట్రయిక్‌రొటేషన్‌తో ఛేదనను సులభతరం చేశాడు. షార్దుల్‌ ఠాకూర్‌తో 15 బంతుల భాగస్వామ్యంతోనే 30 పరుగులు పిండుకుని భారత్‌కు వెస్టిండీస్‌పై వరుసగా పదో వన్డే సిరీస్‌ విజయాన్ని కట్టబెట్టాడు. 

2016లో కాన్‌బెర్రాలో ఆస్ట్రేలియాపై 349 పరుగుల ఛేదనలో శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లి శతకాలు బాదారు. ఎం.ఎస్‌ ధోని నిరాశపరిచిన వేళ లోయర్‌ ఆర్డర్‌లో రవీంద్ర జడేజా 27 బంతుల్లో 24 పరుగులే చేశాడు. సాధించాల్సిన రన్‌రేట్‌కు తగినట్టుగా జడేజా బ్యాటింగ్‌ లేదు. గమ్యం లేని ప్రయాణంలా సాగింది జడేజా ఇన్నింగ్స్‌. 

సరిగ్గా అక్కడి నుంచి మూడేండ్ల తర్వాత అటువంటి భారీ ఛేదనలోనే జడేజా తన అనుభవం, పరిణితి, బ్యాటింగ్‌ స్కిల్స్‌ చక్కగా చూపించాడు. ఆఖర్లో మంచు కారణంగా బంతి పట్టు చేజారుతుందని జడేజా గ్రహించాడు. 

ఇన్నింగ్స్‌ 45వ ఓవర్లో జేసన్‌ హోల్డర్‌ ఛాతి మీదుగా బౌన్సర్‌ సంధించగా, దాన్ని మిడ్‌ వికెట్‌ మీదుగా బౌండరీ తరలించాడు. షెల్డన్‌ కాట్రెల్‌ గతి తప్పిన లెంగ్త్‌ బాల్‌ను సైతం జడేజా అదే రీతిలో సత్కరించాడు. 

Also read: ప్రపంచానికి అవసరం లేదు, నాకు నేనే...: రవీంద్ర జడేజా

ఇన్నింగ్స్‌ 43వ ఓవర్లో లెఫ్టార్మ్‌ ఫింగర్‌ స్పిన్నర్‌ పియరీ బంతులేస్తున్నప్పుడు రెండు బంతుల్లో రెండు సింగిల్స్‌ తీసుకున్న జడేజా.. కెప్టెన్‌ కోహ్లి బౌండరీల మోతకు అవకాశం ఇచ్చాడు. కోహ్లి నిష్క్రమణతో జడేజా టాప్‌ గేర్‌లోకి వచ్చాడు. షార్దుల్‌ ఠాకూర్‌ను మార్గనిర్దేశనం చేస్తూనే దంచి కొట్టాడు. ఠాకూర్‌ ఆరు బంతుల్లోనే 17 పరుగులతో మెప్పించాడు.

నేనే రాజు.... నేనే మంత్రి!  

కటక్‌లో చాలా క్లిష్టమైన ఇన్నింగ్స్‌ ఆడానని, నిర్ణయాత్మక మ్యాచ్‌లో క్రీజులోకి వెళ్లగానే విరాట్‌ జతగా ఆడాల్సి వచ్చినప్పుడు పిచ్ ను తొలుత ఒక అంచనా వేయాలనుకున్నట్టు జడేజా చెప్పాడు. బంతి బ్యాట్‌పైకి చక్కగా వస్తోందనిపించిందని, సులువుగా సింగిల్స్‌ తీసుకొవచ్చని అదే పని చేసానని చెప్పుకొచ్చాడు. ఒక్కసారి దూకుడుగా ఆడటం మొదలెట్టిన తర్వాత వికెట్‌ మరింత బాగుందనిపించిందన్నట్టు చెప్పాడు. 

బంతికి అనుగుణంగా బాదితే సరిపోతుందని, కోహ్లి అవుటైన తర్వాత ఆఖరు బంతి వరకూ ఆడాలని తనకు తాను పదేపదే చెప్పుకున్నట్టు గుర్తుచేసుకున్నాడు. షార్దుల్‌ క్రీజులోకి రాగానే వికెట్‌ బాగుందని చెప్పినట్టు బ్యాట్‌పైకి బంతి వస్తోందని, బంతిని చూసి ఆడితే సరిపోతుందని చెప్పినట్టు గుర్తుచేశాడు. 

షార్దుల్‌తో భాగస్వామ్యం పద్దతిగా సాగిందని, మరో 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదన ముగిసిందని నిజానికి అదే ప్రణాళిక ప్రకారం ఆడినట్టు మ్యాచ్‌ అనంతరం రవీంద్ర జడేజా కూల్‌గా సమాధానమిచ్చాడు. 

ఇక ఈ సందర్భంగానే విమర్శకులకు కూడా ఒక షాక్ ఇచ్చాడు జడ్డు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో చక్కగా ఆడగలనని, తాను ప్రపంచంలో ఎవరికీ ఎమీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని, తనకు తాను మాత్రం నిరూపించుకోవాల్సిందేనని చివరగా విమర్శకులపైనా కూడా ఓ పంచ్‌ పడేశాడు పర్‌ఫెక్ట్‌ ఆల్‌రౌండర్‌ జడేజా.

Follow Us:
Download App:
  • android
  • ios