కటక్: తనకు ఈ ఏడాది అంతా సంతోషంగానే గడిచిందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. కేవలం ఆ అరగంట మాత్రమే తనకు బ్యాడ్ అని అన్నాడు. వెస్టిండీస్ తో మూడో వన్డేలో విజయం సాధించిన తర్వాత అతను మీడియాతో మాట్లాడాడు. 

ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచులో ఆ 30 నిమిషాలు తప్ప ఈ ఏడాది అంతా అద్భుతంగా గడిచిందని కోహ్లీ చెప్పాడు. విజయం కోసం భారత్ ఎల్ల వేళలా తపిస్తుందని చెప్పాడు. ప్రత్యర్థులు ఎవరైనా భారత పేసర్లు ఎదుర్కోగలరని ఆయన అన్నాడు. 

స్పిన్నర్లను మించి పేసర్లు రాణిస్తున్నారని కోహ్లీ అన్నాడు. ఐసిసి నిర్వహించే ట్రోఫీలను గెలుచుకునేందుకు తాము నిత్యం శ్రమిస్తూనే ఉంటామని చెప్పాడు. జట్టులోకి వస్తున్న కొత్త ఆటగాళ్లు భవిష్యత్తులో భారత క్రికెట్ కు మూలస్తంభాలుగా మారుతారని అన్నాడు. ఒత్తిడిలో వారు ఎలా రాణిస్తారో తనకు చూడాలని ఉందని చెప్పాడు.

కటక్ లో జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్ పై భారత్ విజయం సాధించి సిరీస్ ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచులో 85 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.